
ఇదిగో సాక్ష్యం
లోకేష్ యువగళం పాదయాత్రను హైలెట్ చేసేందుకు టీడీపీ నేతలు పడరానిపాట్లు పడుతున్నారు. చినబాబు ఆధ్వర్యంలో ఇతర పార్టీ నేతలను చేర్పించేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా గ్రామస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లి మధ్యస్తాలు పెడుతున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాళ్లబేరానికి దిగుతున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కొండువా కప్పుకోవాలని బతిమలాడుతున్నారు. ఆయన పాదయాత్రగా వచ్చేటప్పుడు పూల దండ వేసి స్వాగతం పలకాలని కాళ్లావేళ్లాపడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మీరేం కోరుకున్నా చేస్తామంటూ బంపర్ ఆపర్లు ఇస్తున్నారు. కానీ జగన్ సైన్యం ససేమిర అంటున్నారు. ‘మీకో దండం.. మేం రాం’ అంటూ ముఖాన్నే చెప్పేస్తున్నారు. దీంతో చేసేది లేక టీడీపీ నేతలు బిక్కమొఖాలేస్తున్నారు.
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నేతలు రకరకాల ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఇటీవల శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలంలో ఓ టీడీపీ కార్యకర్తకు చెందిన ఆరు ఎకరాల వేరుశనగ పంటను దున్నేసి దాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టాలని ప్రయత్నించారు. ఆ పంటను చినబాబు పరిశీలించి వైఎస్సార్‌సీపీపై చిందులేసే విధంగా స్కెచ్చేశారు. కానీ అది బెడిసికొట్టడంతో ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. వారిని ఎలాగైనా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరేవిధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు ముందు రోజు టీడీపీ నేతలు బొజ్జల సుధీర్‌రెడ్డి, మండల స్థాయి నాయకులు కొందరు గతంలో ఆ పార్టీ కోసం పనిచేసిన వారి నివాసాలుకు వెళ్లారు. అలాగే వైఎస్సార్‌సీపీ నేతలను విడివిడిగా కలిసి టీడీపీలోకి ఆహ్వానించగా.. వారు ససేమిర అనడంతో చేసేదిలేక అక్కడి నుంచి వెనుదిరిగినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తిరుపతిలో అద్దె మనుషులకు పార్టీ కండువాలు?
తిరుపతి అసెంబ్లీ పరిధిలో యువగళం పాద యాత్ర సాగుతుండడంతో స్థానిక టీడీపీ శ్రేణులు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘పార్టీలో చేరండి, లేదంటే పాదయాత్రలో పాల్గొనండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు. ఎవ్వరూ సుముఖంగా లేకపోవడంతో కొందరు అద్దె మనుషులను పిలిపించి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
ప్రత్యేక నిఘా
గ్రామస్థాయిలో ముఖ్యమైన వైఎస్సార్‌సీపీ నేతలను కలిసేందుకు టీడీపీ ఓ బృందాన్ని రెడీ చేసింది. ఆ బృందంలోని సభ్యులు యువగళం పాదయాత్ర సాగే ముందురోజు ఆయా గ్రామాల్లోని నేతల ఇళ్లకు వెళ్లడం.. వారిని పార్టీలోకి రావాలని బతిమలాడుతూ బేరసారాలు కుదర్చడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులైతే ఆయా మండలాల నాయకులే వెళ్లి కలుస్తున్నట్టు సమాచారం. మరో వైపు శ్రీకాళహస్తిలో తనయుడు బొజ్జల సుధీర్‌రెడ్డితోపాటు తల్లి బొజ్జల బృందమ్మ సైతం నియోజకవర్గంలో ముఖ్యనాయకుల నివాసాలకు వెళ్లి రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
ఇదిగో సాక్ష్యం
కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర జీడీనెల్లూరు నియోజకవర్గం మీదుగా సాగింది. మార్గంమధ్యలోని శ్రీరంగరాజపురం మండలంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీలో చేరేలా ఆ పార్టీ నేతలు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా కృష్ణమూర్తి(పేరుమార్చాం) నాయకుడి ఇంటికెళ్లి టీడీపీలో చేరాలని బతిమలాడారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకోవాలని కాళ్లావేళ్లాపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని నమ్మబలికారు. చిన్నాచితక కాంట్రాక్టర్ పనులూ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. కానీ ఆయన ‘మాకొద్దు బాబు’ అంటూ వారి ముఖాన్నే చెప్పడంతో ఖంగుతిన్నారు. చేసేది లేక ఉసూరుమంటూ వెనుదిరిగారు.
మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం, పాపానాయుడుపేట మండలంలో లోకేష్ పాదయాత్ర సాగింది. స్థానికంగా చురుగ్గా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు (బుచ్చిరెడ్డి) పేరుమార్చాం ఇంటికి డబ్బు, పార్టీ కండువాలతో టీడీపీ నాయకులు వెళ్లారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరాలని బేరాలకు దిగారు. మీరుచెబితే గ్రామస్తులు కూడా చాలామంది చేరుతారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఏం కావాలన్నా చేస్తామంటూ ఆఫర్లు కురిపించారు. కానీ ఆయన ‘మేం రాం’ అంటూ తెగేసి చెప్పడంతో అక్కడి నుంచి ఉడాయించారు.
.. జిల్లాలో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. లోకేష్ పాదయాత్రలో ఇలాంటివి నిత్యకృత్యం. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గట్‌గా టీడీపీనేతలు బేరాలకు దిగుతున్నారు. ఆఫర్లమీద ఆఫర్లు ఇస్తూ పార్టీలో చేరాలని గడ్డాలు పట్టుకుని మరీ బతిమలాడుతున్నా.. జగన్ సైన్యం అందుకు ససేమిర అనడం చర్చనీయాంశమవుతోంది.