
మదనపల్లె : మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలతో శుక్రవారం ఘర్షణకు దిగారు. వివరాలు.. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన వెంకటేష్ భార్య లోకేశ్వరి 3 నెలల కిందట జిల్లా ఆస్పత్రిలో మొదటి కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఐదు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
ఈక్రమంలో శుక్రవారం ఊపిరాడకపోగా పరిస్థితి విషమంగా మారడంతో ఇంజెక్షన్ వేశారు. అయినా ఎలాంటి మార్పు రాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో చంటిబిడ్డ తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చికిత్సలో తమ తప్పు లేదని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో.. చేసేదిలేక విషణ్ణవదనంతో బిడ్డను తీసుకుని ఇంటికెళ్లిపోయారు.