జాతరో జాతర | Sakshi
Sakshi News home page

జాతరో జాతర

Published Wed, May 22 2024 9:20 AM

జాతరో జాతర

● చిత్తూరులో వాడవాడలా గంగమ్మ సంబరం ● కుప్పంలో అమ్మవారి ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం ● పలమనేరులో తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనం ● ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ● పటిష్ట బందోబస్తు కల్పించిన పోలీసులు

జిల్లాలోని చిత్తూరు.. పలమనేరు.. కుప్పంలో అంగరంగ వైభవంగా గంగజాతర

నిర్వహిస్తున్నారు. మంగళవారం చేపట్టిన వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మా.. గంగమ్మతల్లీ..

కరుణించమ్మా.. అంటూ ప్రణమిల్లారు. పాడిపంటలతో వర్ధిల్లేలా దీవించాలని

ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిపించమని వేడుకున్నారు. వివిధ వేషధారణలతో అమ్మను సేవించుకున్నారు. పొంగళ్లు

పొంగించి నైవేద్యం అందించారు. అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో తల్లిని పూజించి పులకించారు. చిత్తూరులో సింహవాహనంపై అమ్మవారు కొలువుదీరి సకల జనులను కటాక్షించారు. పలమనేరులో తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనం ఇచ్చారు. కుప్పంలో శక్తిస్వరూపిణి శిరస్సును కనులపండువగా ఊరేగించారు.

చిత్తూరు రూరల్‌(కాణిపాకం)/పలమనేరు/కుప్పం : చిత్తూరు నగరంలో మంగళవారం గంగజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నడివీధి, కొంగారెడ్డిపల్లె, సంతపేట, గిరింపేట, దొడ్డిపల్లె, మురకంబట్టు, ఓబనపల్లె తదితర ప్రాంతాల్లో జాతరను వేడుకగా నిర్వహించారు. అమ్మవారు సింహవాహనం అధిష్టించి భక్తులను అనుగ్రహించారు. గంగమ్మను దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా అంబలి, పిండివంటలను సమర్పించారు. భక్తులు తమ మొక్కులను చెల్లించేందుకు వివిధ వేషధారణలతో వచ్చారు.

పలమనేరులో..

పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అమ్మవారు మంగళవారం తెల్లవారుజాము నుంచి గంగమ్మ తోపులోని పుట్టింట్లో భక్తుల దర్శనార్థం కొలువు దీరారు. శిరస్సు మెరవణి తర్వాత భక్తులకు విశ్వరూపదర్శన భాగ్యం కల్పించారు.

నేడు జలధితో పరిపూర్ణం

గంగమ్మ జాతర బుధవారం జలధి కార్యక్రమంతో పరిపూర్ణం కానుంది. బుధవారం ఉదయం 5 గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి గాంధీనగర్‌ సమీపంలోని బావిలో నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

కుప్పంలో శిరస్సు ఊరేగింపు

కుప్పం పట్టణంలో తిరుపతి గంగమ్మజాతర సందర్భంగా అమ్మవారి శిరస్సును వైభవంగా ఊరేగించారు.చెరువు కట్ట వద్ద పెద్ద బావి దగ్గర ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి కళ్లకు తెర తొలగించి గ్రామోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఊరేగింపు తిలకించేందకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో కుప్పం జన సంద్రంగా మారింది.

నేడు నిమజ్జనం

చిత్తూరులో ఆనవాయితీ ప్రకారం రెండవరోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తుంటారు. ఈక్రమంలో బుధవారం 4 గంటలకు నడివీధితో పాటు పలు ప్రాంతాల్లో కొలువైన గంగమ్మ ప్రతిమలను నిమజ్జనానికి తరలించనున్నారు. ఈ సందర్భంగా వంశపారంపర్యధర్మకర్తలు అమ్మవారికి సారె సమర్పించనున్నారు. నిమజ్జనోత్సవంలో ఓంశక్తి విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement