పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై వస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. బాబర్ ఆజం బృందాన్ని ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పీసీబీ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్థానికి మీడియా పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమిపాలైన బాబర్ బృందం.. కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచింది.
అయితే, అప్పటికే గ్రూప్-ఏ నుంచి టీమిండియా, అమెరికా సూపర్-8కు చేరగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంటాబయటా పాక్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ముబాషిర్ లుక్మాన్ బాబర్ ఆజంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పాక్ కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు.
ఈ క్రమంలో పీసీబీ వర్గాలు స్పందించాయి. ‘‘విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అదుపులో ఉన్నంత వరకు విమర్శకుల పట్ల మాకెలాంటి అభ్యంతరం లేదు.
అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తూనే ఉన్నాం.
ఆటగాళ్ల విషయంలో పీసీబీకి ఎలాంటి సందేహాలు లేవు. అలాంటపుడు విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు ఆధారాలతో సహా ముందుకు రావాలి.
ఒకవేళ అందులో గనుక విఫలమైతే మేము పరువునష్టం దావా వేయడానికి కూడా వెనుకాడం. ఇందుకు సంబంధించి ఓ కొత్త చట్టం తీసుకురాబోతున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమణ తర్వాత పాక్ ఆటగాళ్లు విదేశాల్లో సెలవులను ఆస్వాదించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment