విద్యార్థుల జీవితాలతో ఆటలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో ఆటలు

Published Thu, Feb 27 2025 2:10 AM | Last Updated on Thu, Feb 27 2025 2:11 AM

విద్యార్థుల జీవితాలతో ఆటలు

విద్యార్థుల జీవితాలతో ఆటలు

విద్యార్థులు చదివింది తిరుపతి జిల్లాలో.. పరీక్షలు రాయబోయేది చిత్తూరు జిల్లాలో ఇదేమి వింత ధోరణి అని విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు తిరుపతి జిల్లాకు చెందిన 84 మంది విద్యార్థులు చిత్తూరు జిల్లా కేంద్రానికి విచ్చేసి పరీక్షలు రాయనున్నారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన కూటమి అలసత్వంతో ఇలాంటి అవస్థలు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ అధికారుల నుంచి అనుమతి లేకుండా తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఎస్‌ఎస్‌ఆర్‌ అనే కళాశాల 2024–2025 విద్యాసంవత్సరంలో నిర్వహించారు. తిరుపతిలో కళాశాల నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఓంప్రకాష్‌ చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన ఎస్వీ కళాశాల కరస్పాండెంట్‌ నుంచి కళాశాలను కొనుగోలు చేసుకున్నారు. కొనుగోలు చేసుకున్న తిరుపతి నిర్వాహకుడు ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అలా తీసుకోకుండా ప్రస్తుత విద్యాసంవత్సరం అంతా తిరుపతిలో కళాశాలను నిర్వహించారు. ఈ వ్యవహారం పలుమార్లు అక్కడి విద్యార్థి సంఘాలు తిరుపతి ఇంటర్మీడియట్‌ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత తిరుపతి ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్‌ అధికారులు అప్పట్లోనే కళాశాలను సీజ్‌ చేసి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవి కావు. అలా చేయకుండా ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాల నిర్వాహకుడికి అనుకూలంగా ఇంటర్మీడియట్‌ అధికారులు వ్యవహరించారు. ఈ సమస్య జఠిలమై పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్‌లు వచ్చే సరికి 84 మంది విద్యార్థుల భవిష్యత్‌కు అంధకారంలోకి వెళ్లేలా చేసింది.

విద్యార్థులకు అగచాట్లు

ఈ వ్యవహారంలో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలేమో సాఫీగా ఉంటున్నాయి. చివరికి 84 మంది విద్యార్థులు మాత్రం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఆ విద్యార్థుల హాల్‌టికెట్‌లు జారీ కాకపోవడంతో సమస్య తీవ్రం అయింది. చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో విచారణ నిర్వహించారు. పెనుమూరు కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత క్షుణ్ణంగా విచారణ చేసిన అనంతరం రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అధికారులకు విచారణ నివేదికలను పంపారు. తిరుపతి జిల్లాకు చెందిన 84 మంది విద్యార్థుల వివరాలు పెనుమూరు ఎస్వీ జూనియర్‌ కళాశాల లాగిన్‌లోనే నమోదయ్యారు. దీంతో వారందరినీ చిత్తూరు జిల్లాలో చదివినట్లుగానే పరిగణించాల్సి వచ్చింది.

తిరుపతి విద్యార్థులకు చిత్తూరులో పరీక్ష

కూటమి పాలనలో ఇంటర్‌ విద్యార్థులకు వింత అనుభవం

ప్రైవేట్‌ కళాశాల నిర్వాహకంతో విద్యార్థుల అవస్థలు

అనుమతి లేని కళాశాలల నిర్వహణతోనే ఈ పరిస్థితి

84 మంది విద్యార్థులకు చిత్తూరులోనే కేంద్రాలు..

ఈ విషయంపై రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చి విద్యార్థులకు అన్యాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 84 మంది విద్యార్థులకు పరీక్షలు ఎలా రాయించాలనే విషయంపై చిత్తూరు డీవీఈఓ సయ్యద్‌ మౌలాతో సంప్రదింపులు జరిపారు. తిరుపతి జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించాలంటే ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాలకు అనుమతి లేదు. దీంతో విద్యార్థుల వివరాలు పెనుమూరు మండలం ఎస్వీ కళాశాల లాగిన్‌లోనే ఉండడంతో చిత్తూరు జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్ష ఫీజుకు అదనంగా జరిమానా విధించి తత్కాల్‌ విధానంలో ఎస్వీ కళాశాల నిర్వాహకుడు ఫీజు చెల్లించాలని ఆదేశించారు. ఎస్వీ కళాశాల నిర్వాహకుడు జరిమానాతో 84 మంది విద్యార్థుల ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించారు. దీంతో ఆ విద్యార్థులకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చివరికి మార్చి 1వ తేదీ నుంచి తిరుపతి జిల్లా నుంచి చిత్తూరుకు వచ్చి విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement