ఆశలు.. ఊసులు
● రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల ఎదురుచూపులు ● ఆలయాల అభివృద్ధికి కరువైన నిధులు ● పర్యాటక అభివృద్ధికి నిధులే కీలకం ● సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నిస్తున్న జనం
జిల్లా సమాచారం
జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌లు 04
జిల్లాలోని మండలాలు 32
జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822
జిల్లాలోని గ్రామ పంచాయతీలు 697
జిల్లా జనాభా 18.73 లక్షలు
పురుషులు 9.40 లక్షలు
మహిళలు 9.33 లక్షలు
రూరల్ జనాభా 15.04 లక్షలు
అర్బన్ జనాభా 3.69 లక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో జిల్లా వాసులు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ సమస్యలు, ప్రధాన ఆలయాల అభివృద్ధి, పర్యాటక రంగం, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై జిల్లా వాసుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కావడంతో బడ్జెట్ పై రైతులు, మహిళలు, వ్యాపారులు, పేద, మధ్య తరగతి వర్గాలకు దక్కనున్న ప్రయోజనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జాడలేని సంక్షేమం
జిల్లాలో 4.56 లక్షల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో 18.73 లక్షల మంది నివసిస్తున్నారు. పురుషులు 9.40 లక్షలు, మహిళలు 9.33 లక్షల మంది ఉన్నారు. రూరల్‌లో 15.04 లక్షల మంది, అర్బన్‌లో 3.85 లక్షల మంది నివసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తోంది. ఈ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల అమలుపై ఎన్నో హామీలు గుప్పించింది. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యం కల్పించాలి
చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపైనే రైతులు, ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గంలో మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను ప్రారంభించింది. ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు గతంలో రూ.2144.50 కోట్ల అంచనాలు సైతం సిద్ధం చేశారు. అయితే పలు కారణాలతో పెండింగ్ పడిన ఆ రిజర్వాయర్‌లను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని పుంగనూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గండికోట రిజర్వాయర్, అలాగే చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల్లో కండలేరు రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పూర్తికి రూ.7659.06 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు.
పర్యాటక అభివృద్ధికి నిధులు అవసరం
జిల్లాలో పర్యాటక అభివృద్ధికి నిధులు అవసరం ఉంది. జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ప్రధానమైన కాణిపాకం, బోయకొండ, అర్ధగిరి, ననియాల తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కుప్పం, నగరి, పలమనేరు, పులిగుండు వద్ద ఉన్న పర్యాటక హోటల్‌లు నిధుల కొరతతో అభివృద్ధిలో వెనుకబడ్డాయి. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రూ.57.24 కోట్ల ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. పర్యాటక అభివృద్ధికి కూటమి టీడీపీ చొరవ చూపుతుందో లేదో వేచి చూడాల్సిందేనని ప్రజలు నిరీక్షిస్తున్నారు.
ఆలయాల అభివృద్ధికి ..
చిత్తూరు జిల్లాలో దేవాదాయ శాఖ అధీనంలో మొత్తం 1592 ఆలయాలున్నాయి. వీటిలో 6ఏ కింద 06, 6 బీకింద 25, 6సీ కింద 1546, 6డీ కింద 15 ఆలయాలున్నాయి. వీటిలో ప్రధానమైన ఆలయాల్లో సౌకర్యాలు మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. ఆలయాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని కాణిపాకం, అర్ధగిరి అరగొండ, బోయకొండ, తదితర ఆలయాల్లో సౌకర్యాలను మెరుగు పర్చాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment