మొగిలి ఘాట్‌లో ఆటోను ఢీకొన్న లారీ
– 9 మంది భక్తులకు గాయాలు
బంగారుపాళెం : మండలంలోని మొగిలి ఘాట్‌లో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడియాత్తంకు చెందిన 9 మంది భక్తులు గాయపడ్డారు. అందులో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడగా మరో ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన తొమ్మిది మంది భక్తులు మొగిలి శివాలయానికి బయలుదేరారు. గుడియాత్తం నుంచి పలమనేరుకు బస్సులో వచ్చారు. అక్కడ నుంచి మొగిలికి ఆటోలో బయలుదేరారు. మార్గ మధ్యలో మొగిలి ఘాట్ వద్ద ఆటోను పలమనేరు నుంచి చిత్తూరు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడియాత్తంకు చెందిన పద్మ, తులశమ్మకు కాళ్లు విరిగిపోయాయి. కల్పన తలకు బలమైన గాయమైంది. ప్రేమ తీవ్రంగా గాయపడింది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పద్మ, తులశమ్మ, కల్పన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
కార్వేటినగరం : ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అన్నూరు బస్‌షెల్టర్ వద్ద చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజ్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా.. వెదురుకుప్పం మండలం చవటగుంట దళితవాడకు చెందిన గోవర్ధన్ ద్విచక్ర వాహనంలో కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి దళితవాడలోని తన అత్తగారి ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో అన్నూరు బస్టాండ్ వద్ద మండలంలోని అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(66) బస్సు కోసం వేచి ఉన్న సమయంలో గోవర్ధన్ ద్విచక్ర వాహనంలో వేగంగా దూసుకొచ్చి చొక్క లింగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.అలాగే ద్విచక్ర వాహనంలో వచ్చిన గోవర్ధన్‌కు తీవ్రగాయాలు కావడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చొక్కలింగం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మొగిలి ఘాట్‌లో ఆటోను ఢీకొన్న లారీ
Comments
Please login to add a commentAdd a comment