
యథేచ్ఛగా మట్టి దందా
● ఆనవాళ్లు కోల్పోతున్న చెరువులు ● కూటమి నాయకుల కనుసన్నల్లో మట్టి దోపిడీ ● కుప్పంలో అడ్డుపడేది ఎవరు.. అడిగేది ఎవరు?
కుప్పం రూరల్ : కుప్పం నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మట్టి దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. నిత్యం ఏదో ఒక చెరువులో మట్టి తొలగిస్తూనే ఉన్నారు. రాత్రీ,పగలు తేడా లేకుండా మట్టి దోపిడీ చేస్తూ రూ.లక్షల్లో వెనుకేసుకుంటున్నారు. ఈ మొత్తం తతంగం కూటమి నేతల కనుసన్నల్లోనే సాగుతుండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.
పరిస్థితి ఇలా..
కుప్పం నియోజకవర్గంలో 500కు పైగా చెరువులను ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాల కోసం అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు. ఒక కుప్పం మండలంలోనే 145 చెరువులు ఉన్నాయి. ఇందులో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు 8, వందకు లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 137 ఉన్నాయి. వీటిలో నిత్యం ఏదో ఒక చోట మట్టి దోపిడీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుప్పం పట్టణానికి ఆనుకున్న ఉన్న లక్ష్మీపురం, వీరప్పనాయునిచెరువు, దామలచెరువు, కుప్పం చెరువు, పెద్దబంగారునత్తం చెరువుల్లో దోపిడీ ఎక్కువైంది. ఇక్కడ మట్టి దోచుకోవడం పరిపాటిగా మారింది. దీంతో 50 నుంచి 60 అడుగుల మేర గుంతలు ఏర్పడి చెరువులు కళా విహీనంగా మారింది. గుంతల్లో జేసీబీ, ట్రాక్టర్లు ఉన్నా కనిపించని విధంగా తయారైంది. ఇంత పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడంతో వర్షాలు కురిసినా నీరు ఎక్కువ కాలం నిలువ ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువుల్లో పైభాగాన ఉండే మట్టి, ఇసుక తొలగిస్తే నీరు త్వరగా ఇంకిపోయి భూమి అడుగుల్లోకి వెళ్లిపోతుందని సూచిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
నిత్యం చెరువుల్లో మట్టి దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సామాన్యుడి చెరువులోకి వెళ్లి వచ్చినా ఆంక్షలు గుర్తుకు వచ్చే అధికారులకు భారీ యంత్రాలతో అడ్డ గోలుగా మట్టి తరలిపోతున్నా కనిపించడం లేదు. ముఖ్యంగా కుప్పం పట్టణానికి ఆనుకుని ఉన్న లక్ష్మీపురం, కుప్పం, వీరప్పనాయుని, పెద్దబంగారునత్తం చెరువుల్లో నిత్యం రాత్రీ, పగలు తేడా లేకుండా దోపిడీ జరుగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి నియోజక వర్గంలో కావడం, దోపిడీ వెనుక కూటమి నేతల హస్తం ఉండడంతో ఏ వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి వస్తుందో అని అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రతి రోజు కుప్పం వచ్చి వెళ్లే జిల్లా అధికారులు సైతం ఈ దోపిడీని అడ్డుకోలేకపోవడం దారుణమని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేసి చెరువులను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
కూటమి నేతల కనుసన్నల్లోనే ..
ఇది వరకు ఒక ఎత్తు... కూటమి ప్రభుత్వం రావడంతో మరో ఎత్తు అన్న విధంగా మట్టి దోపిడీ పరిస్థితి తయారైంది. కూటమి ప్రభు త్వం రావడంతో బియ్యం, ఇసుకతో పాటు మట్టి దోపిడీపై వారి కన్నుపడింది. అధినేత నియోజక వర్గం కావడంతో తమకు అడ్డు ఉండదని, చోటామోటా నాయకుల నుంచి మండల స్థాయి వరకు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడు మట్టి రూ.400 వరకు పలుకుతుండడంతో అక్రమార్కులు నిత్యం లక్షల్లో దోచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment