
పేట్రేగుతున్న ‘పచ్చ’ మాఫియా!
● ఇసుక, గ్రావెల్‌ను అడ్డదిడ్డంగా తోడేస్తున్న వైనం ● సరిహద్దు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలింపు ● రూ. లక్షలు స్వాహా చేస్తున్న కూటమి నేతలు
కార్వేటినగరం : సమయం లేదు మిత్రమా.. అందిన కాడికి దోచేద్దాం.. ఎవరైనా అడ్డొస్తే అంతు చూస్తాం. మాట వినకపోతే ఏ అధికారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదు. అక్రమాలను అడ్డుకుంటున్న అధికారులపై కూటమి నాయకుల బెదిరింపులు, దాడులతో హడలిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో చోటా నాయకుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ అక్రమాలు, దందాలు, దోపిడీలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూటమి నాయకులు చేస్తున్న దందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొంత మంది ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక, మట్టిని విచ్చల విడిగా తోడేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. పట్టగపలే యథేచ్ఛగా గ్రావెల్‌తో పాటు ఇసుకను తోడి రవాణా చేస్తున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఒక పక్క ఇసుక మరోపక్క గ్రావెల్‌ను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు దండుకుంటున్నారు.
అక్రమార్కుల అడ్డాగా జీడీ నెల్లూరు
గంగాధర నెల్లూరులోని ఆరు మండలాల్లోనూ కూటమి నేతలు మట్టి, ఇసుక దోపిడీ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతమైన గంగాధర నెల్లూరు పచ్చ మాఫియాకు అడ్డాగా మారింది. ప్రధానంగా పాలసముద్రం, గంగాధర నెల్లూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల్లో నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు.
ఇసుక దోపిడీ ఇలా..
● గంగాధర నెల్లూరు మండలంలోని ముక్కలత్తూరులో నీవానది నుంచి చైన్నెకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుకను డంప్ చేసి రాత్రికి రాత్రే తమిళనాడుకు తరలించి దోచేస్తున్నారు.
● పాలసముద్రం మండలం నుంచి నిత్యం వందల టన్నుల్లో ఇసుక తరలిస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలంలోని నీవా నది నుంచి పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం, సింహరాజపురం, బలిజకండ్రిగ, మటవలం గ్రామాల్లో డంప్ చేసి రాత్రికి రాత్రే టిప్పర్లలో కూటమి నేతలు ఇసుకను తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక రూ.25 వేలు ధర పలుకుతోంది. 16 చక్రాలు గల టిప్పర్లలో రెండు రోజుల కొకసారి ఇసుకను తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు.
● పచ్చికాపల్లం, వెదురుకుప్పం ప్రాంతాల నుంచి మట్టి దోపిడీ జరుగుతోంది. ఇటీవల బ్రాహ్మణపల్లె సమీపంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వాహనాలను అడ్డుకోబోయిన వీఆర్‌ఏపై అధికార పార్టీకి చెందిన వ్యక్తి దాడి చేశాడు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆ వ్యక్తిపై కేసు నమోదుకు సిపార్సు చేసినా ఓ ఎమ్మెల్యే అడ్డుతగిలి కేసు నమోదు చేయకుండా కాపాడినట్లు విమర్శలు వస్తున్నాయి.
● శ్రీరంగరాజపురంలో కూటమి నేతలు విచ్చలవిడిగా మట్టి దందా చేస్తున్నారు. గ్రావెల్ కోసం గుట్టలను మాయం చేస్తున్నారు.
● కార్వేటినగరం మండలంలో గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేదు. ఓ ఎమ్మెల్యే మండలం కావడంతో ఇసుకను డంప్ చేసుకుని రవాణా చేస్తున్నారు. ఇక్కడ నుంచి పళ్లిపట్టు మీదుగా చైన్నెకి తరలివెళుతోంది.
క్వారీల్లో దందాలు
క్వారీ యజమానుల వద్ద నుంచి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు తెగబడుతున్నారు. ఆరు మండలాల్లోనూ పీఏలను నియమించిన ఆయన వివరాలను సేకరించి దందాలకు పాల్పడుతున్నారు. నేను ఎమ్మెల్యే పీఏని మామూళ్లు ఇస్తావా సీజ్ చేయమంటావా అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment