పన్నుల వసూళ్లు.. పూర్
● ఆస్తి పన్ను వసూళ్లల్లో మున్సిపాలిటీలు వెనుకంజ ● పది రోజుల్లో ముగియనున్న గడువు ● రూ.కోట్లకు గానూ.. అరకొరగానే వసూళ్లు ● పన్నులు రాకుంటే అభివృద్ధికి గడ్డుపరిస్థితే !
చిత్తూరు అర్బన్ : ఆస్తిపన్ను.. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకు ప్రాణవాయువు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 12 రోజుల సమయం మాత్రమే ఉంది. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భవనాలతో కలిసి లక్ష వరకు భవనాలున్నాయి. ఈనెలాఖరుకు పాత బకాయిలతో కలిసి మొత్తం రూ.62.63 కోట్లు వసూలు కావాల్సి ఉంటే.. మంగళవారం సాయంత్రానికి రూ.29.48 కోట్లు వసూలయ్యింది. కొన్ని చోట్ల కమిషనర్లు మున్సిపాలిటీ ఖజానాను బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలు ఆస్తి పన్ను వసూళ్ల ప్రభావంపై సానుకూలంగానే చూపిస్తోంది. అదే సమయంలో మరికొన్ని మున్సిపాలిటీలు పన్ను వసూళ్లపై అసలు ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదని గణాంకాలే చెబుతున్నాయి. పన్ను వసూళ్లకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆశించిన స్థాయిలో ఏ మేరకు ఆస్తి పన్ను వసూళ్లవుతాయో అధికారులకు అర్థంకాని పరిస్థితి.
వడ్డీ మాఫీ చేస్తారని?
ఆస్తి పన్నుపై గత ప్రభుత్వం వడ్డీని మాఫీ చేసింది. ఈసారి కూడా వడ్డీ మాఫీ చేస్తే భారీ మొత్తంలో పన్నులు వసూలయ్యే అవకాశం ఉంది. ప్రజలపై పడిన అదనపు భారం కూడా తగ్గనుంది. వడ్డీ మాఫీ చేస్తారో..?లేదో..? అని ప్రజల్లో అనుమానాలు ఉండటం వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఇదే సమయంలో వసూలైన పన్నులు నేరుగా ప్రభుత్వ పీడీ ఖాతాలో జమ చేస్తుండటంతో అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని వెచ్చించే వెసులుబాటు అధికారులకు, కౌన్సిల్‌కు ఉండటంలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు ఇలా..
మున్సిపాలిటీ భవనాలు మొత్తం బకాయి వసూలు
(కోట్లలో..)
చిత్తూరు 44,879 రూ.39.60 రూ.16.97
పుంగనూరు 13,637 రూ.7.20 రూ.4.48
పలమనేరు 13,447 రూ.4.92 రూ.3.16
కుప్పం 12,998 రూ.6.38 రూ.2.51
నగరి 14,837 రూ.4.53 రూ.2.35
Comments
Please login to add a commentAdd a comment