‘రుణం ఇప్పిస్తామని మోసం చేశారు’
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రుణం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళలు తమ వద్ద నగలు, డబ్బు తీసుకొని మోసం చేశారని చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధికి చెందిన ధనలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యాపారం నిమిత్తం రుణం కోసం తాము ప్రయత్నిస్తుండగా.. ముగ్గురు మహిళలు రుణం ఇస్తామని మాయ మాటలు చెప్పి తమ వద్దనున్న రూ. 4 లక్షల విలువైన బంగారు నగలు, 4 లక్షలు నగదు తీసుకున్నారని చెప్పారు. నగలను వారి పేరిటే తాకట్టుపెట్టి డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్లే తీసుకున్నారని వాపోయారు. మా డబ్బులు, నగలు ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించగా..ఆ మహిళలు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. కాజూరు ప్రాంతానికి చెందిన దేవి మాట్లాడుతూ.. ఆ ముగ్గురు మహిళలు తనకు రూ.10 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తామని చెప్పి, బ్యాంక్ డిపాజిట్ పేరుతో రూ.లక్షలు తీసుకున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని అయితే ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వారిపై కేసులు నమోదు చేసి తమ నగదును రికవరీ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment