
● ఆ అధికారి వింత చేష్టలు ● అనుమానం వస్తే తప్పని వేధింపు
అపరిచితుడు !
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ అధికారి తీరుతో శాఖ అధికారులు, సిబ్బంది బేజారవుతున్నారు. ప్రతి దానికి అందరిపై అనుమానం పడుతున్నారని తలలు పట్టుకుంటున్నారు. కార్యాలయంలో జరిగే విషయాలు బయటకు, పత్రికలకు ఎలా తెలుస్తున్నాయని ఆ అధికారి తిట్ల పురాణం మొదలు పెడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇకపై విషయాలు బయటికొస్తే ఎవరిని వదిలిపెట్టను..సస్పెండ్ చేస్తానని ఆ అధికారి హెచ్చరికలు జారీ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్తూరోళ్లు అంతా ఇలానే ఉంటారంటూ బహిరంగా చెప్పడంపై పలువురు విస్తుపోతున్నారు. విలేకరులతో ఎవరెవ్వరూ మాట్లాడుతున్నారో గుచ్చి గుచ్చి అడుగుతున్నారని, అలా అనుమానం ఉన్న వాళ్లపై నిఘా పెట్టి వేధిస్తున్నారని కంటతడి పెడుతున్నారు. ఈ తరుణంలో 20 మంది వరకు సీట్లు మార్చారని పలువురు కోడైకూస్తున్నారు. ఇందులో అటెండర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఉన్నారని చెబుతున్నారు. కార్యాలయంలోని అందరూ తన వర్గానికి అనుకూలంగా ఉండాలని కొంత మందిని అనధికారికంగా డెప్యూటేషన్‌పై తీసుకొచ్చారని అంటున్నారు. డెప్యూటేషన్‌లను ప్రభుత్వం రద్దు చేసినా...ప్రత్యేకంగా డెప్యూటేషన్లు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వర్క్ ఆర్డర్ సాకు చూపి ఇలా చేయడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. ఇంట్లో సమస్యలు, ఈ వేధింపులు పడకలేక మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని మహిళా ఉద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి కార్యాలయంలో అనుమానం పేరుతో ఇబ్బంది పడుతున్న అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూడాలని కార్యాలయ అధికారులు, సిబ్బంది వేడుకుంటున్నారు.
లారీని ఢీకొన్న బైక్
– ఇద్దరికి తీవ్ర గాయాలు
బంగారుపాళెం : మండలంలోని మొగిలి ఘాట్ చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నుంచి పలమనేరు వెళుతున్న లారీని మొగిలి ఘాట్ వద్ద ముందుపోతున్న ద్విచక్ర వాహనాన్ని అధిగమించే క్రమంలో మరో ద్విచక్రవాహనం లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన మనోజ్, చైన్నెకి చెందిన వేలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సారా విక్రయిస్తూ
మహిళ అరెస్టు
చిత్తూరు అర్బన్ : నాటు సారా విక్రయిస్తున్న ఓ మహిళను ఆదివారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా... టూటౌన్ పోలీసులు చిత్తూరు నగరం తేనేబండ ప్రాంతంలో నాటు సారా విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గౌరీ (45) అనే మహిళ సారా విక్రయిస్తుండగా నాలుగు లీటర్ల సారాను స్వాధీనం చేస్తుకున్నారు. మహిళపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

● ఆ అధికారి వింత చేష్టలు ● అనుమానం వస్తే తప్పని వేధింపు
Comments
Please login to add a commentAdd a comment