
పెద్దల నుంచి రక్షణ కల్పించండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రేమ వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని చౌడేపల్లి మండ లం బీర్జేపల్లెకు చెందిన అనూ హ్య, చిట్టిరెడ్డిపల్లెకు చెందిన వంశీ తెలిపారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ప్రేమజంట జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనూహ్య మాట్లాడుతూ తాను వంశీని ఏడేళ్లుగా ప్రేమిస్తున్నానని, కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు. దీంతో తామిద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెప్పారు. తమ ప్రాణాలకు ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అదనపు లైన్‌కు ప్రతిపాదనలు
చిత్తూరు కార్పొరేషన్: వేసవిలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా నూతనంగా అదనపు లైన్‌కు ప్రతిపాదన పెట్టినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. గురువారం చిత్తూరు రూరల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలోని ఎస్‌ఎస్ కొండ, వెదురుకుప్పం ప్రాంతాల్లో లోడ్ పెరుగుతుందన్నారు. వీటిని సర్దుబాటు చేయడానికి మాంబేడు సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టామన్నారు.
అలాగే అదనంగా కొత్తపల్లెమిట్ట నుంచి వేపంజేరి, ఎస్‌ఎస్ కొండకు 17 కిలోమీటర్లు రూ.80 లక్షల వ్యయంతో 33 కేవీ లైన్ ఏర్పాటుకు నివేదిక పంపామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూరల్ పరిధిలో విడుదల చేయాల్సిన వ్యవసాయ సర్వీసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ సురేష్, డీఈ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మాజీ సైనికుడి మృతి
ఐరాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎగువ కామినాయనపల్లెకు చెందిన మాజీ సైనికుడు రాజేంద్రనాయుడు(65) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాణిపాకం ఏఎస్‌ఐ కథనం మేరకు.. ఎగువ కామినాయనపల్లెకు చెందిన మాజీ సైనికుడు రాజేంద్రనాయుడు, భార్య లక్ష్మి ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంలో స్వగ్రామం నుంచి బుధవారం రాత్రి సొంత పనుల నిమిత్తం జంగాలపల్లెకు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదే సమయంలో తవణంపల్లె మండలం పట్నం గ్రామానికి చెందిన హరీష్ ఐరాల నుంచి పట్నం వెళుతున్నాడు.
ఈ నేపథ్యంలో జంగాలపల్లె బస్‌స్టాప్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో రాజేంద్రనాయుడు, హరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని 108లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం రాజేంద్రనాయుడుని వేలూరు సీఎంసీకి తరలించారు. రాజేంద్రనాయుడు అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా హరీష్‌కు తలలో రక్తం గడ్డ కట్టడంతో రాణిపేట సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.