బెంగళూరు: ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరేపించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేశాడు.
దీంతో ఆగ్రహం చెందిన కొంతమంది వ్యక్తులు అతడిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు.(బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం)
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలు అయినట్లు తెలిపారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 110 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ కమిషనర్(క్రైం) సందీప్ పాటిల్ తెలిపారు. అదే విధంగా వివాదాస్పద పోస్టుతో ఘర్షణ వాతావారణానికి మూల కారణమైన నవీన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషను పరిధిలో కర్ఫ్యూ విధించామని, బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment