
పెదకూరపాడు: కరోనా రక్కసి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ కుటుంబం ఆస్పత్రిలో చేరగా, ఇదే అదునుగా భావించిన దొంగలు.. వారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు కథనం ప్రకారం.. పాటిబండ్ల గ్రామస్తుడు గార్లపాటి పూర్ణచంద్రరావు తన ఇంట్లో చిల్లర కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల రెండో తేదీన పూర్ణచంద్రరావు కోవిడ్‌తో మృతిచెందాడు. దీంతో ఆయన భార్య నాగచంద్రిక, వారి ఇద్దరు కుమార్తెలు, తల్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఈనెల 6న గుంటూరులోని అడవితక్కెళ్లపాడు క్వారంటైన్ సెంటర్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగిటివ్‌గా తేలడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా, చోరీ జరిగిన విషయం వెల్లడైంది. బీరువాను ఇనుప బద్దతో తెరిచి, అందులోని 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించారు. గార్లపాటి నాగచంద్రిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ బారినపడి కుటుంబ పెద్దను కోల్పోయి, తల్లడిల్లుతున్న తమకు ఈ చోరీతో ఆర్థికంగానూ తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment