దొడ్డబళ్లాపురలో ఆర్‌ఐ లక్ష్మినరసింహయ్య ఇంట్లో లభించిన వెండి, బంగారం, డబ్బు
సాక్షి, బెంగళూరు: తెల్లవారుజామునే లంచగొండి అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. నిద్రమత్తు నుంచి తేరుకునేలోపు ఇళ్లలో ఏసీబీ అధికారులు చొరబడ్డారు. అప్పుడప్పుడు జరిగినట్లు పారిపోయే అవకాశం కూడా లేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వేకువజామున 15 మంది అధికారులు, ఉద్యోగుల నివాసాలు, వారి సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఏకకాలంలో 60 చోట్ల సాగిన సోదాల్లో 408 మంది ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. కొంతకాలంగా నిఘా పెట్టిన ఏసీబీ.. విపరీతంగా ఆస్తులు ఆర్జించిన, లంచాలు తీసుకుంటున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంది.
విద్యుత్ ఉద్యోగి వద్ద విదేశీ నగదు
► బెళగావి హెస్కాంలో లైన్ మెకానిక్‌గా ఉన్న నేతాజీ హీరాజీ పాటిల్ నివాసంలో సోదాలు చేయగా విదేశీ కరెన్సీతో పాటు ప్లాటినం ఆభరణాలు లభ్యం అయ్యాయి. అనేకమంది అధికారుల ఇళ్లలో పెద్దమొత్తాల్లో నగదు, బంగారం, వెండి సొత్తు, ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. వీటిలో లెక్కలు లేనివే అధికం. పలువురి వద్ద విలాసవంతమైన కార్లు, బైక్‌లు ఉన్నట్లు తేలింది. సోదాలు, బ్యాంకు ఖాతాల పరిశీలన ఇంకా కొనసాగుతోంది.
దాడులు ఎవరెవరి మీద
► కేఎస్ లింగేగౌడ, ఈఈ, స్మార్ట్ సిటీ, మంగళూరు
► కె.శ్రీనివాస్, ఈఈ, హెచ్‌ఎల్‌బీసీ, మండ్య జిల్లా
► లక్ష్మీ నరసింహయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, దొడ్డబళ్లాపుర
► వాసుదేవ, యోజనా వ్యవస్థాపక నిర్మాణ కేంద్రం, బెంగళూరు
► బి.కృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్, నందినీ డైరీ, బెంగళూరు
► టీఎస్ రుద్రేశప్ప, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ, గదగ్ జిల్లా
► ఏకే మస్తి, కోఆపరేటివ్ ఆఫీసర్, సవదత్తి, బైలహŸంగల, బెళగావి జిల్లా
► సదాశివ మారలింగణ్ణనవార్, ఇన్‌స్పెక్టర్, గోకాక్
► నేతాజీ హీరాజీ పాటిల్, గ్రూప్ సి, బెళగావి
► కేఎస్ శివానంద, విశ్రాంత సబ్ రిజిస్ట్రార్, బళ్లారి
► రాజశేఖర్, ఫిజియోథెరపిస్ట్, యలహంక ఆస్పత్రి, బెంగళూరు
► మాయణ్ణ, ఎఫ్‌డీఏ, బీబీఎంపీ రోడ్డు పనులు, బెంగళూరు
► ఎల్‌సీ నాగరాజు, సకాల, బెంగళూరు
► జీవీ గిరి, గ్రూప్‌డి, బీబీఎంపీ, యశవంతపుర
► శాంతగౌడ బిరాదార్, పీడబ్ల్యూడీ ఇంజినీర్, కలబురిగి
అక్రమాల ఆర్‌ఐకి షాక్
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా కసబా క్లస్టర్ రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ లక్ష్మినరసింహయ్య ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో సోదాల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు దొరికాయి. హెసరఘట్టలో అక్రమ ఆస్తి,పలు చోట్ల సైట్లు ఉన్నట్టు ధృవీకరించే పత్రాలు దాడిలో లభించాయని సమాచారం. విలేజ్ అకౌంటెంట్‌గా 15 ఏళ్ల కిందట ఉద్యోగంలో చేరారు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి కోట్ల విలువ చేసే ఇతరుల ఆస్తిని సొంతవాళ్లకు కట్టబెట్టినట్లు గతంలో కేసు నమోదైంది.
ఆ ఇంట్లో 7 కేజీల పసిడి
శివమొగ్గ: నగరానికి చెందిన గదగ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రుద్రేశప్ప ఇంటిలో 7 కేజీల బంగారం, కట్టల కొద్దీ డబ్బులు లభించినట్లు సమాచారం. శివమొగ్గలో పలుచోట్ల ఆయన ఆస్తులపై దాడులు జరిగాయి. బంగారు బిస్కెట్లు, నెక్లెస్‌లు, లెక్కలేనన్ని ఉంగరాలు బయటపడ్డాయి.
చింతామణి: పట్టణంలోని మాళపల్లి ప్రాంతంలో నివాసం వున్న కేఎంఎఫ్ మేనేజర్ కృష్ణారెడ్డి ఇంట్లో ఏసీబీ డీఎస్పీ సుధీర్, ఎస్‌ఐ మంజునాథ్ సోదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment