Hyderabad CP Anjani Kumar Warns To Trojan Malware, Don't Open Joker Softwar - Sakshi
Sakshi News home page

జోకర్‌ఏమిటి జోకర్‌ యాప్స్‌.. బహుపరాక్‌

Published Thu, Jun 17 2021 7:42 AM | Last Updated on Thu, Jun 17 2021 11:09 AM

Anjani Kumar Warns About Malware Softwares In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెల్‌ఫోన్లతో పాటు కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు కొత్త మాల్‌వేర్లను సృష్టించారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఫోన్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని తస్కరించే ఈ మాల్‌వేర్‌ను జోకర్‌ ఫొటోలతో ప్రత్యేక యాప్‌ల రూపంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో పొందుపరిచారని పేర్కొన్నారు. దీని బారిన పడిన అనేక మంది ముంబై వాసులు ప్రధానంగా యువత భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోయారని చెప్పారు.


బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సైబర్‌ నేరగాళ్లు జోకర్‌ యాప్స్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి చొప్పిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. జోకర్‌ బొమ్మలతో ఆకర్షణీయంగా కన్పించే ఈ యాప్‌లకు సంబంధించిన లింకులను సైబర్‌ నేరగాళ్లు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే వారి సెల్‌ఫోన్, కంప్యూటర్లలోని సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి పోతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్‌లలోని ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అపరిచిత వెబ్‌సైట్లలోకి వెళ్లడం, యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం, లింక్‌లను క్లిక్‌ చేయడం వంటివి చేయకుండా ఉండాలని సూచించారు. వైట్‌కాలర్, సైబర్‌ నేరాలకు పాల్పడిన 74 మందిపై ఇప్పటివరకు పీడీ యాక్ట్‌ ప్రయోగించామని తెలిపారు.  

ఏమిటీ జోకర్‌ 
జోకర్‌ మాల్‌వేర్‌ తొలిసారిగా 2017లో వెలుగులోకి వచ్చింది. 2020లో జోకర్‌ మాల్‌వేర్స్‌తో ఉన్న 11 యాప్‌లను, ఈ ఏడాది ఇప్పటివరకు 22 యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది.

ఎలా స్వాహా చేస్తుంది
ఎవరైనా తమ సెల్‌ఫోన్, కంప్యూటర్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేస్తే.. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్‌లను తన అధీనంలోకి తీసుకుంటుంది. ప్రాథమికంగా వారి ప్రమేయం లేకుండా సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో కొంత మొత్తం స్వాహా చేస్తుంది. ఆపై ఆ ఫోన్‌కు వచ్చే ఓటీపీలు తదితరాలను కాపీ చేసి సైబర్‌ నేరగాళ్లకు అందిస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అనేక యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుటనేప్పుడు వాటిని తమ ఫోన్‌లోని ఎస్‌ఎంఎస్‌లను యాక్సెస్‌ చేసుకునే అనుమతి ఇస్తాం. దీన్ని అనుమానిత యాప్‌లకు డినై చేయాలి. అనవసర యాప్స్‌ను పొరపాటున డౌన్‌లోడ్‌ చేసినా వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి.

ఎలా గుర్తించాలి?
ఇలాంటి మాల్‌వేర్స్‌ ద్వారా ఏదైనా అనధికారిక ఆర్థిక లావాదేవీ జరిగిందా అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీనికోసం బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్, క్రెడిట్‌ కార్డు బిల్లుల్లోని అనధికారిక, తమ ప్రమేయం లేని లావాదేవీలను చూసుకోవాలి. చాలావరకు ఈ మాల్‌వేర్స్‌ తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు డబ్బు స్వాహా చేస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement