ఆర్యన్‌ను వైద్యపరీక్షలకు తీసుకెళ్తున్న అధికారులు
ముంబై/థానే: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరం సమీపంలో సముద్రంపై విహరిస్తున్న ఓ పర్యాటక నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు గాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు.
నిందితులు ఆర్యన్ ఖాన్, మున్‌మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఒకరోజు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్‌పై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 8సీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎన్‌సీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారిస్తున్నారు.
నౌకలో మాదక ద్రవ్యాలతో ఆర్యన్ ఖాన్, మున్‌మున్ ధామేచా, నూపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ పట్టుబడ్డారని, వీరిలో ఇద్దరు యువతులు ఉన్నారని వెల్లడించారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎక్‌స్టసీ మాత్రలు, 5 గ్రాముల మెఫిడ్రోన్(ఎండీ), 1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దుస్తులు, పర్సుల్లో డ్రగ్స్
ముంబై నుంచి గోవాకు పయనమైన కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి చేశారు. నౌకలో అనుమానితులను సోదా చేశారు. వారి వద్ద పలు రకాల మాదక ద్రవ్యాలు లభించాయి. వాటిని దుస్తుల లోపల దాచిపెట్టినట్లు గుర్తించారు. యువతులు తమ పర్సుల్లో డ్రగ్స్ దాచుకున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. అయితే, డ్రగ్స్ పార్టీతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు ప్రైవేట్ కార్యక్రమం కోసం ఈ నౌకను అద్దెకు ఇచ్చామని వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అధ్యక్షుడు జుర్గెన్ బైలామ్ తెలియజేశారు. కేవలం కుటుంబాలకు వినోదం కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని, తమ నౌకల్లో అనుచితమైన పనులను ప్రోత్సహించబోమని వివరించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటు న్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ అరెస్టును అధికారులు ప్రకటించడానికంటే కొద్ది సేపటి ముందు షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి లాయర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి అరెస్టుపై ఆయన ఇంకా అధికారికంగా స్పందించలేదు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: రాందాస్ అథవాలే
నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వంటి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కోరుతానని అన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ దందా బహిర్గతమయ్యిందని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో ఇదొక పెద్ద జాడ్యంగా తయారయ్యిందని చెప్పారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు.
ముంద్ర పోర్టు ఘటన నుంచి దృష్టి మరల్చడానికే: కాంగ్రెస్
గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో ఇటీవల పట్టుకున్న రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముంబైలో డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత షమా మహమ్మద్ ఆరోపించారు. ముంద్ర పోర్టు ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ముంద్ర పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) రూ.21,000 కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్‌ఖాన్ తనయుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఎన్‌సీబీని షమా మహమ్మద్ ప్రశ్నించారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు.
ఎవరీ సమీర్ వాంఖెడే
పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్‌లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్‌ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్‌సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment