ఆకారంలో పోలీసులతో బాలుడి బాధిత బంధువుల వాగ్వాదం, మృతి చెందిన బాలుడు (ఫైల్ ఫోటో)
శాలిగౌరారం (నకిరేకల్) : నెలల బాలుడి మృతి మిస్టరీగా మారింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి యల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె సంతోష(26)ను మండలంలోని వల్లాలకు చెందిన ఆడెపు యాదగిరికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు(10 నెలలు) ఉన్నారు. ఏడాది కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత జనవరి 23న ఆకారంలోని తన తల్లిగారింటికి వచ్చిన సంతోష ఈనెల 3న కుమారుడితో ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు.
సఖ్యతగా మెలుగుతున్న వ్యక్తితో వెళ్లి..
జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బాలకిషన్ అత్తగారు గ్రామం ఆకారం. సంతోష పుట్టిల్లు, బాలకిషన్ అత్తగారి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఈనెల 3న ఇంటినుంచి వెళ్లి కోదాడలో కాపురం పెట్టారు. అయితే, అనుకోకుండా మంగళవారం సంతోష కుమారుడికి ఫిట్స్ వచ్చాయి. వెంటనే వారు కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు.
గ్రామంలో ఉద్రిక్తత
బాలుడి మృతదేహంతో సంతోష కారులో బుధవా రం తెల్లవారుజామున గ్రామానికి చేరుకుంది. పుట్టింటికి కాకుండా సమీప బంధువు ఇంటికి వెళ్లి విషయాన్ని వివరించింది. బాలుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న యాదగిరి (బాలుడితండ్రి) కుటింబికులు వల్లాలకు చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకారం గ్రామానికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బాలుడిని సంతోష, బాలకిషన్‌లు తలపై కొట్టి హత్య చేసి ఉంటారని తండ్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, బాలుడి మృతదేహాన్ని వల్లాల తీసుకెళ్లేందుకు తండ్రి యాదగిరి కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నచ్చజెప్పి బాలుడి మృతదేహానికి నకిరేకల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బా లుడి మృతదేహంపై అంతర్గతంగా , బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేనట్లు వైద్య నివేదికలో వెల్లడైనట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలుడి తల్లి సంతోషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, సంతోష తండ్రి యల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment