బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత పల్లవి ప్రశాంత్‌ అరెస్టు  | Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Arrested, Shifted To Chanchalguda Jail For 14 Days Custody - Sakshi
Sakshi News home page

Pallavi Prashanth Arrest Updates: బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత పల్లవి ప్రశాంత్‌ అరెస్టు 

Published Thu, Dec 21 2023 4:41 AM | Last Updated on Thu, Dec 21 2023 11:41 AM

Bigg Boss season7 winner Pallavi Prashant arrested - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌)/ గజ్వేల్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో ఏ–1, ఏ–2 నిందితులుగా ఉన్న బిగ్‌బాస్‌ సీజన్‌–7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అర్ధరాత్రి తర్వాత న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్‌ ఎస్‌ఎస్‌ఐ మెహర్‌ రాకేశ్‌ ఫిర్యాదు మేరకు దాడి ఘటనలో ప్రమేయమున్న నరేందర్, అతని స్నేహితుడు వినయ్, కారు డ్రైవర్లు సాయికిరణ్, ఎ.రాజుపై కేసు నమోదు చేశారు.

అందులో సాయికిరణ్, రాజులను ఈనెల 19న అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. అంతకుముందు జూబ్లీహిల్స్‌ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ప్రశాంత్‌ ఇంటివద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మ, బంధువులు ఆందోళనకు గురయ్యారు.

ఈనెల 17న బిగ్‌బాస్‌ సీజన్‌ –7 ఫైనల్స్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్‌ అమర్‌దీప్‌ అభిమానులు చేరుకోగా అందులోని కొంతమంది ఆకతాయిలు రాళ్లను తీసుకుని బిగ్‌బాస్‌ సీజన్‌ 6 లో పాల్గొన్న గీతూ రాయల్, ప్రస్తుత సీజన్‌ కంటెస్టెంట్‌ అశ్వినీ కార్లను, ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 

అజ్ఞాతంలోకి వెళ్లలేదు: ప్రశాంత్‌
తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రశాంత్‌ స్పష్టం చేశారు. అరెస్టుకు ముందు బుధవారం సాయంత్రం తన నివాసంలో తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం తాను ఇంటి వద్ద నుంచి ఎవరికీ చెప్పకుండా పొలం వద్దకు వెళ్లి వచ్చానని, దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, తానెక్కడా అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని, అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement