
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అజయ్‌కుమార్
సాక్షి,బాడంగి( విజయనగరం): ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని ఆశించిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. రోడ్డుప్రమాదంలో కన్నపేగు దుర్మరణం పాలవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన దాసరి దేవేంద్ర, రాధల కుమారుడు అజయ్‌కుమార్ (14) డొంకినవలస ఎత్తుకానాపై టీహబ్‌సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
విజయనగరంలోని జమ్మునారాయణ పురం మహాత్మాగాంధీ జ్యోతి రావు పూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అజయ్‌కుమార్ పాఠశాలలు మూసివేయడంతో కొన్నినెలలుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. మేనత్తకూతురు విజయనగరం నుంచి కామన్నవలస జంక్షన్ వద్ద బస్సు దిగుతుందని, బావ గిరడ భానుప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటాలేలాండ్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. భాను ప్రసాద్‌కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. వ్యాన్‌డ్రైవర్ త్రినాథ్‌ను అదుఫులోకి తీసుకుని వ్యాన్ సీజ్ చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.నరేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment