
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,సైదాపురం(నెల్లూరు): విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సైదాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితులు బుధవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తుమ్మలతలుపూరులో మైకా మైన్ ఉన్నత పాఠశాల ఉంది. అందులో ఆగ్రామానికి చెందిన 11 ఏళ్ల గిరిజన బాలిక ఆరో తరగతి చదువుకుంటోంది. (చదవండి: ఆ రాత్రి ఏం జరిగింది? వీడుతున్న హత్య కేసు మిస్టరీ )
మంగళవారం హిందీ టీచర్ మల్లికార్జున ఆ విద్యార్థిని విరామ సమయంలో గదిలోకి పిలిపించుకున్నారు. నీవు పరీక్ష రాయలేదుగదా.. ఆ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు తీసుకో అంటూ దగ్గరకు పిలుచుకుని తాకరానిచోట తాకుతూ పైశాచిక ఆనందం పొందారని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు వెళ్లగా ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లారు. దీంతో వారు తహసీల్దార్ కృష్ణకును కలిశారు. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన తీరును ఆ బాలిక తహసీల్దార్‌కు వివరించింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారించాలని తహసీల్దార్ పోలీసులకు ఆదేశించారు. గతంలో కూడా ఈ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయన ప్రవర్తన సరిగాలేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు జరిమానా విధించారని, దేహశుద్ధి కూడా చేశారని ఆరోపణలు ఉన్నాయి.