
ఓబులవారిపల్లె/రాయచోటి/అమరావతి: మద్యం మత్తు ఐదుగురు ప్రయాణికుల ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా చిన్నఓరంపాడు వద్ద నాలుగో నంబర్ జాతీయ రహదారిపై దాబా హోటల్ సమీపంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కడప ఐసీఎల్ నుంచి చెన్నైకి సిమెంట్ పొడి లోడుతో వెళ్తున్న లారీ ట్యాంకర్ చిన్నఓరంపాడు దాబా వద్ద అదుపు తప్పి తిరుపతి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని మితిమీరిన వేగంతో నడుపుతూ రోడ్డుకు అటూ ఇటూ తిప్పుతూ రావడాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి బస్సును తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించి కుడి వైపునకు పూర్తిగా పక్కకు తిప్పాడు. దీంతో ట్యాంకర్ లారీ ఆర్టీసీ బస్సు మధ్య భాగంలో కండక్టర్ సీటు వద్ద నుంచి బస్సు వెనుక భాగం వరకు బలంగా ఢీకొంది.
ఘటనా స్థలంలో ముగ్గురు.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరి మృతి
బస్సులోని మ«ధ్య సీట్లలో కూర్చున్న వైఎస్సార్ జిల్లా కోగటం గ్రామానికి చెందిన బి.కమాల్ బాషా (65), అన్నమయ్య జిల్లా చిన్నఓరంపాడు జనంపల్లె దళితవాడకు చెందిన జి. శ్రీనివాసులు (60) అలియాస్ బుడ్డయ్య, రాజంపేట మండలం వెంకటరాజంపేట గ్రామానికి చెందిన కొమరావతి శేషాద్రి శేఖర్ (55)అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం దొగ్గలపాడు గ్రామానికి చెందిన చెవ్వు అమర్‌నాథ్‌రెడ్డి (25), నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య (70)లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఇంటర్మీడియెట్ చదువుతున్న నికిత, వెన్నెల అనే బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి తరలించారు.
వీరు కాకుండా మరో 12 మందికి గాయాలయ్యా యి. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం కారణంగా లారీ ట్యాంకర్, బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పుల్లంపేట నుంచి మంగంపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాజంపేట డీఎస్పీ చైతన్య ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించాలన్నారు.
సీఎం ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టినట్టు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు వేర్వేరుగా తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఘటనపై ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఆర్టీసీ తరఫున పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తామన్నారు.