అంగళ్లులో చంద్రబాబు రెచ్చగొడుతుండగా.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తొడగొడుతూ, చెప్పు చూపిస్తున్న టీడీపీ మూకలు (ఫైల్)
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు సంబంధించి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ కేసు నమోదైంది.
ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్‌ఐ షేక్ ముబిన్‌తాజ్ కేసు నమోదు చేశారు.
వినతిపత్రం ఇచ్చేందుకు వేచి ఉండగా
ప్రాజెక్టుల సందర్శన యాత్ర చేపట్టిన చంద్రబాబు ఈనెల 4న అంగళ్లుకు వస్తున్నారని తెలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి, ఎంపీపీ దస్తగిరి, జెడ్పీటీసీ జ్యోతి భర్త బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, కులశేఖర్‌రెడ్డి తదితరులు అంగళ్లు కూడలి సమీపంలోని రాయచోట రోడ్డు వద్దకు చేరుకున్నారు. పిచ్చలవాండ్లపల్లె సాగు, తాగ నీటి రిజర్వాయర్ పనులను చంద్రబాబు కోర్టు ద్వారా నిలిపివేయించారని, ఈ చర్యను నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి శాంతియుత పద్ధతిలో ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని వేచి ఉన్నారు. వారికి రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మద్దతుగా వచ్చారు.
ఊగిపోయి.. దాడులకు ఉసిగొల్పి..
మధ్యాహ్నం చంద్రబాబు యాత్ర కూడలిలోకి చేరుకుంది. అక్కడ నల్ల కండువాలతో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులను చూసి చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్‌సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు.
మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్‌సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆధారాలతో ఫిర్యాదు
మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ఆధారాలతో సహా చంద్రబాబు తదితరులపై ఫిర్యాదులో చేశారు. అంగళ్లు రోడ్‌షోలో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర నాయకుల చర్యలను పెన్‌డ్రైవ్, సీడీలో ముదివేడు పోలీసులకు అందజేశారు. ఈ ఫిర్యాదు, ఆధారాల మేరకు పోలీసులు చంద్రబాబు ఏ1గా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక, నేరపూరిత కుట్ర, అల్లర్లలో భాగంగా మారణాయుధాలతో తమపై దాడిì చేసిన చంద్రబాబు అనుచరులు, దాడులకు పురమాయించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఉమాపతిరెడ్డి కోరారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఇవే అంశాలను పేర్కొన్నారు.
చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు : అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్‌రావు
రాయచోటి టౌన్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ముదివేడు పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అంగళ్లులో జరిగిన సంఘటనపై ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని తెలిపారు. ఈనెల 4 న మారుణాయుధాలు, ఐరన్ రాడ్లు, రాళ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ములకలచెరువు పోలీసు స్టేషన్‌లో బాబుపై మరో కేసు
ములకలచెరువు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అన్నమయ్య జిల్లా ములకలచెరువు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ నెల 4న ములకలచెరువులో జరిగిన రోడ్ షోలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇన్‌చార్జి సీఐ శివాంజనేయులు సమగ్ర విచారణ జరిపిన అనంతరం చంద్రబాబును ఏ–7 నిందితుడిగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment