దొండపర్తి (విశాఖ దక్షిణ): పసికందుల అక్రమ విక్రయం వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న ‘సృష్టి’ ఆస్పత్రి తీగలాగితే... అక్కయ్యపాలెం హైవేపై ఉన్న పద్మశ్రీ ఆస్పత్రి డొంక కదులుతోంది. పసిపిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతను అరెస్టు చేసి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సృష్టి ఆస్పత్రిలో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా చేపట్టిన విచారణలో సీతమ్మధార సమీపంలో ఉన్న పద్మశ్రీ ఆస్పత్రితో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పద్మశ్రీ ఆస్పత్రిలో శనివారం తనిఖీలు నిర్వహించారు. (సెంట్రల్ జైలులో డాక్టర్ నమ్రత హంగామా)
ఆస్పత్రి ఎండీ డాక్టర్ పద్మజను విచారించారు. లోపల సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసిపిల్లల అక్రమ రవాణా విషయంలో ఒక డెలివరీ పద్మశ్రీ ఆస్పత్రిలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పసిపిల్లల అక్రమ రవాణా వ్యవహారంపై ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతతో పాటు పద్మజ ఆస్పత్రిపైనా కూడా 120బీ, 417, 420, 370, అలాగే సెక్షన్ 81, 77 జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఆస్పత్రులతోపాటు నగరంలో ఉన్న మరికొన్ని ఆస్పత్రుల ద్వారా కూడా పసికందుల అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు )
సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం
పద్మజ ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరిగాయి..?, పిల్లల అక్రమ రవాణాలో వీరి పాత్ర ఏంటనే అంశంపై పూరిస్థాయిలో దృష్టి సారించాం. దర్యాప్తులో భాగంగా కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. పద్మజ ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ పద్మజను ఇప్పటికే విచారించాం. ప్రాథమిక దర్యాప్తునకు పూర్తిస్థాయిలో ఆమె సహకరించారు. ఈ విచారణలో భాగంగా సృష్టి ఆస్పత్రిపై ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదు చేశాం. పద్మజ ఆస్పత్రిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేయలేదు. కొద్ది రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం. ఎంవీపీ ఇన్‌చార్జి సీఐ అప్పారావు, ఎస్‌ఐ సూర్యనారాయణ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది. – మూర్తి, ద్వారక ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment