కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు! | Corona Victims Target: Cyber ​​criminals Phone Calls Asha Workers | Sakshi
Sakshi News home page

కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్‌: డబ్బులు​ ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!

Published Tue, Oct 4 2022 4:24 PM | Last Updated on Tue, Oct 4 2022 5:46 PM

Corona Victims Target: Cyber ​​criminals Phone Calls Asha Workers - Sakshi

చక్రాయపేట మండలానికి చెందిన కరోనా బాధిత కుటుంబానికి ఫలానా వారు ఫోన్‌ చేస్తారని ఆశా వర్కర్‌ తెలియజేశారు. కొద్దిసేపటిలోనే సైబర్‌ కేటుగాళ్లు ఫోన్‌ చేసి వివరాలన్నీ తీసుకున్నారు. అయితే బా«ధిత కుటుంబీకుల ఖాతాలో సొమ్ములు లేకపోవడంతో మీ సంబంధీకులతో మాట్లాడించాలని సూచించారు. దీంతో వీరబల్లి మండలానికి చెందిన బంధువుతో మాట్లాడించగా, వారి వివరాలు కనుగొని ఖాతా నుంచి సుమారు రూ. లక్ష వరకు సులువుగా దోచేశారు. 

సాక్షి రాయచోటి : అవకాశం దొరికితే ఎవరినైనా బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇంతకుమునుపు ఇంగ్లీషులోనో...హిందీలోనో మాట్లాడుతూ మనుషులను ఏదో ఒక రకంగా మాయ చేసి సొమ్ము కాజేసేవారు. ఈజీగా మనీ సంపాదించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకసారి ఈకేవైసీ, మరోసారి బ్యాంకులో సాంకేతిక సమస్య ఇలా చెబుతూ పోతే అనేక సమస్యలు వెతికి బా«ధితులను బుట్టలో వేసుకుంటున్న మాయదారి మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెర తీశారు. బాధితులు నమ్మరన్న సాకుతో ఆశా వర్కర్లతోనే ఫలానా వారు ఫోన్‌చేస్తారని చెప్పించి.. తర్వాత వీడియో కాల్‌ చేసి తెలుగులో మాట్లాడుతూ సొమ్ములు వేస్తున్నామని చెప్పి వివరాలు రాబట్టి అకౌంటులో ఉన్న మొత్తాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమయ్యాయి. 

కరోనా సొమ్ము పేరుతో టోకరా 
నాలుగైదు రోజులుగా అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో కలెక్టరేట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ముందుగా ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం లేదా వలంటీర్లకు ఫోన్‌ చేసి కరోనాతో మృతి చెందిన వారికి సంబంధించి పరిహారం (ఇన్‌స్రూెన్స్‌) వచ్చిందని నమ్మబలుకుతున్నారు. అయితే సైబర్‌ నేరస్తులు కలెక్టరేట్‌ పేరు చెప్పడంతో నిజంగా నమ్మి బాధిత కుటుంబాలకు పరిహారం సొమ్ము వచ్చిందని భావించి వివరాలు అందిస్తున్నారు. అంతేకాకుండా సైబర్‌ నేరగాళ్లు సంబంధిత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్లతోనే బాధితులకు ఫోన్‌ చేయించి ఫలానా వారు ఫోన్‌ చేసి వివరాలు అడుగతారని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

దీంతో సైబర్‌ నేరగాళ్లు నేరుగా బాధితులకు ఫోన్‌ చేసి వివరాలు అడగడంతోపాటు వీడియో కాల్‌ చేసి తెలుగులో మాట్లాడుతూ మేము చెప్పిన విధంగా అప్‌లోడ్‌ చేయాలని బాధితులను పక్కదారి పట్టిస్తున్నారు. అందులోనూ మీ అకౌంటులో కొంత మొత్తం ఉంటేనే ఈ పరిహారం సొమ్ము పడుతుందని చెప్పి.. వీడియో కాల్‌లోనే ఓటీపీ అడిగి తీసుకుని సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు వైఎస్సార్‌ జిల్లాలో కనిపించాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.  

రోజుకో మోసం 
ప్రజలకు సంబంధించి ఏదో ఒక సమస్యపై సైబర్‌ నేరగాళ్లు ఏదో ఒక రకంగా మోసం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. చివరకు కరోనాతో కుటుంబీకులను కోల్పోయిన బాధితులను కూడా పరిహారం డబ్బుల ఆశ పేరుతో మోసం చేస్తున్నారు. వివరాలు, ఇతరత్రా చెప్పకపోతే సొమ్ములు రావేమోనన్న భయంతో అప్పటికప్పుడు బాధితులు వారు అడిగివన్నీ తెలియజేస్తూ దారుణంగా మోసపోతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుశాఖ కూడా సీరియస్‌గా దృష్టి సారించింది. వీడియో కాల్‌లో తెలుగులో మాట్లాడుతూ మోసం చేస్తున్న వైనంపై ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మహిళా పోలీసులతోపాటు పోలీసుస్టేషన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

మనల్ని మనం కాపాడుకునే ఆయుధం పెట్టుకోవాలి 
మనం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి తాళం వేస్తాం. ఒకటి, రెండుసార్లు సరిగా వేశామో, లేదో తనిఖీ చేసి బయటికి వెళతాం. అలాగే సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ (ఫోన్‌ పే, గుగూల్‌ పే, పేటీఎం) ఫోన్‌ పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తేలికైన పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే సైబర్‌ నేరగాళ్ల చేతికి తాళాలు మనమే ఇచ్చినట్లుగా భావించాలి. పుట్టిన తేదీ, పెళ్లిరోజు, పిల్లలు, భాగస్వామి పేరు లాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసినప్పుడు వెంటనే చెక్‌ చేయడం ద్వారా ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. పాస్‌వర్డ్‌ ఎనిమిది అంకెలకు తక్కువ లేకుండా అక్షరాలతోపాటు నంబర్లు, గుర్తులను పెట్టుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌ మార్చుకుంటే మంచిది. 

కరోనా ఆర్థికసాయం పేరుతో కాల్స్‌ వస్తే నమ్మరాదు 
కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని నైబర్‌ నేరగాళ్లు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. అలాంటి ఫేక్‌ కాల్స్‌ నమ్మరాదు. ఈ విధంగా కరోనా పేరుతో సైబర్‌ నేరగాళ్ల బారిన పడి పలువురు మోసపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికసాయం అందించే యాప్‌లుగానీ, లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయవద్దు. బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 50 వేలు ఉండాలని చెబుతూ సదరు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెబితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి మోసగిస్తున్నారు. ఎవరైనా ఫోన్‌ చేసినా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement