
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సంస్థను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. దాని సర్వర్‌లో ఉన్న లోపాన్ని క్యాష్ చేసుకోవడానికి క్లయింట్‌గా పరిచయమయ్యారు. అదును చూసుకుని సాంకేతిక సమస్య సృష్టించి రూ.1.28 కోట్లు కాజేశారు. సోమవారం రాత్రి కేవలం అరగంట వ్యవధిలోనే ఈ–కేటుగాళ్లు తమ పని పూర్తి చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం బాధిత కంపెనీ శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మోసం ఇలా...
బంజారాహిల్స్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ వివిధ కంపెనీలకు పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన సాంకేతిక సేవల్ని అందిస్తోంది. ఆయా కంపెనీలకు సంబంధించిన యూపీఐ లావాదేవీలన్నీ దీని ద్వారానే జరుగుతుంటాయి.
బంజారాహిల్స్ సంస్థకు దాదాపు 100 కంపెనీలు క్లయింట్స్‌గా ఉన్నాయి. ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు ఒడిస్సాకు చెందిన ఎలక్ట్రికల్ వైర్ల తయారీ కంపెనీ ముసుగులో వీరి వద్దకు వచ్చారు. తమ లావాదేవీలకు సంబంధించిన యూపీఐ సేవల్నీ అందించాలని కోరారు.
దీనికి నగర సంస్థ అంగీకరించడంతో పాటు వాళ్ల ఖాతాలను తమ సర్వర్‌లో రిజిస్టర్ చేసింది. ఒక సంస్థ లేదా వ్యక్తి నుంచి మరో సంస్థ లేదా వ్యక్తికి యూపీఐ ద్వారా చెల్లింపులు జరగాలంటే ఆ మొత్తం బంజారాహిల్స్ సంస్థకు చెందిన పూల్ ఖాతా నుంచి జరుగుతుంది. ఒకరి ఖాతాలో ఉన్న డబ్బు దీని ద్వారానే మరొకరి ఖాతాలోకి వెళ్తుంది.
కొన్ని రోజుల పాటు నగర సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన సైబర్ నేరగాళ్లు సోమ వారం రాత్రి అసలు కథ మొదలెట్టారు. ఆ రోజు రాత్రి నగర సంస్థకు చెందిన సర్వర్‌లో సాంకేతిక సమస్య సృంష్టించారు. ఆపై లావాదేవీలు చేయడం ద్వారా తమ ఖాతా ల్లో డబ్బు లేకపోయినా పేమెంట్ గేట్‌వే సేవల్ని అందించే సంస్థ పూల్ అకౌంట్
నుంచి ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేశారు.
ఇలా కేవలం అరగంట వ్యవధిలో రూ.1.28 కోట్లను ఎనిమిది వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. మరికొంత కొల్లగొట్టే ప్రయత్నాలు చేసినా...సర్వర్‌లో సమస్యపై అలారం రావడంతో నగర సంస్థ సత్వరం స్పందించింది. ఆ లోపాన్ని సరిచేయడంతో సైబర్ నేరగాళ్లు మరికొంత మొత్తం కాజేయలేకపోయారు.
ప్రతి రోజూ నిర్వహించే ఆడిటింగ్ నేపథ్యంలో జరిగిన స్కామ్‌ను బంజారాహిల్స్ సంస్థ గుర్తించింది. దీనిపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేసి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఒడిస్సాకు చెందినదిగా చెప్పిన ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన దానితో పాటు నగదు బదిలీ అయిన ఖాతాలను పరిశీలించారు.
ప్రస్తుతం వాటిలో పెద్ద మొత్తం బ్యాలెన్స్ లేదని గుర్తించారు. పథకం ప్రకారం ఈ నేరం చేసిన సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో పడిన డబ్బును డ్రా చేయడమో, మళ్లించడమో చేశారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలకు పాల్పడిన వారిని గుర్తించడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా బ్యాంకుల నుంచీ సమాచారం సేకరిస్తున్నారు.
ఒడిస్సాకు చెందినదిగా చెప్పిన కంపెనీ నేరం జరగడానికి ముందు, ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని సంస్థ సేవల్ని వినియోగించుకోకపోవడాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment