కారులో బాలిక ఎక్కుతుండగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యం. (ఇన్‌సెట్‌లో) సుగుణ
సాక్షి, నాగర్‌కర్నూల్: సరదాగా కారులోకి వెళ్లిన తర్వాత డోర్‌లాక్ పడటంతో ఓ బాలిక ఊపిరాడక మరణించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారంరాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కడమంచి అంజమ్మ తన భర్త దూరం కావడంతో కూలిపనులు చేస్తూ కూతురు సుగుణ(9)తో కలసి జీవిస్తోంది.
నాలుగో తరగతి చదువుతున్న సుగుణ చెత్త సేకరణ నిమిత్తం ఈ నెల 2న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకువెళ్లింది. మధురానగర్ సమీపంలో ఓ ఇంటి వెనకాల రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు వద్దకు చేరుకుంది. కారు డోర్లను తీసేందుకు ప్రయత్నించగా ఎడమ వైపు ఉన్న ముందు డోరు తెరచుకుంది. బాలిక కారులోకి వెళ్లి కూర్చొని డోర్ వేయగానే డోర్ లాక్ అయింది.
డోర్ తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లకు దూరంగా కారును పార్క్ చేసి ఉంచడం, జన సంచారం లేకపోవడంతో కారులో బాలిక ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. దీంతో ఊపిరాడక కారులో సొమ్మసిల్లి పడిపోయింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు కారు యజమానికి చెందిన బంధువు కారు తీసేందుకు రాగా.. లోపల బాలిక మరణించిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, కూతురు కోసం తల్లి పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని భావించి ఎదురుచూసింది. ఈలోగా కారులో ఇరుక్కున్న బాలిక 32 గంటల తర్వాత శవమై కనిపించడం కలకలం రేపింది. మృతదేహాన్ని జిల్లాస్పత్రికి తరలించారు.
అద్దాలు పగలకొట్టేందుకు ప్రయత్నించినా..
బాలిక కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. సీఐ హన్మంతు వచ్చి వారికి సర్దిచెప్పారు. అనంతరం పోలీసులు సంఘటనాస్థలంలోని సీసీ కెమెరాను పరిశీలించగా బాలిక చెత్త ఏరుకుంటూ అక్కడున్న కారులోకి సరదాగా వెళ్లినట్లు గుర్తించారు. అయితే కారులో ఉన్న జాకీరాడ్‌తో కారు అద్దాలను పగలకొట్టేందుకు బాలిక విఫలయత్నం చేసింది. ఈ దృశ్యాలు కూడా సీసీ ఫుటేజీలో కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment