
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య హత్య కేసులో చిక్కుముడులు వీడాయి. నిందితుడు నాగేంద్ర వాదనలో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. దీనిపై సీపీ బత్తిన శ్రీనివాసులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దివ్య తేజస్విని హత్య కేసులో విచారణ పూర్తి చేశాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాము. ఫోరెన్సిక్, మెడికల్ రిపోర్టులు కూడా వచ్చాయి. దివ్య.. నిందితుడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమె చేతులకు కత్తిగాట్లు పడ్డాయి. ( వాడికి బతికే అర్హత లేదు )
గొంతు కోసి, కడుపులో బలంగా పొడవటం వల్లే దివ్య చనిపోయింది. శాస్త్రీయ ఆధారాలు నివేదికల్లో ఉన్నాయి. కత్తి పోట్లపై నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాము. నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వల్ల అరెస్ట్ చేయలేకపోతున్నాం. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చేస్తాము. కోర్టులో హాజరు పరిచాక న్యాయమూర్తి అనుమతితో కస్టడీలోకి తీసుకొని వివరాలు రాబడతామ’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment