
న్యాయవాది వద్ద స్వాధీనం చేసుకున్న నకిలీ ఐడీ కార్డు
అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లా అనకాపల్లిలో న్యాయస్థానాన్ని మోసగించబోయిన ఓ నకిలీ వకీలు న్యాయమూర్తి అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరు వ్యక్తుల బెయిల్ పిటిషన్ వాదించడానికి వచ్చిన తానే కటకటాలపాలయ్యాడు. పట్టణ ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ అందించిన వివరాలు.. విశాఖ డాబాగార్డెన్స్‌కు చెందిన సంపంగి చినబంగారి దుర్గా సురేష్‌కుమార్ న్యాయవాదిలా నల్లకోటు వేసుకొని అనకాపల్లి 11వ మెట్రోపాలిటన్ జడ్జి ఎస్.విజయచందర్ ముందు గురువారం బెయిల్ పత్రాలు దాఖలు చేశాడు. కోర్టు ప్రశ్నలకు తడబడడంతో న్యాయమూర్తికి అనుమానం వచ్చి అతని పూర్తి వివరాలు చెప్పాలని కోరారు.
సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయగా, అక్కడున్న న్యాయవాదులు అతన్ని పట్టుకున్నారు. సురేష్‌కుమార్ వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలిస్తే.. దానిపై టి.దేవేందర్ అనే అడ్వకేట్ పేరు ఉండగా, ఫొటో మాత్రం సురేష్‌కుమార్‌ది ఉంది. దీంతో న్యాయమూర్తి కోర్టు సూపరింటెండెంట్‌ను పిలిచి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. నకిలీ వకీల్‌ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు శుక్రవారం ప్రవేశపెట్టగా, 14 రోజులు రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment