తల్లితో చిన్నారి స్నేహ(ఫైల్)
బాలానగర్: బిడ్డ ఆలనా.. పాలనా చూడాల్సిన కన్న తల్లి చనిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కూతురిని పెంచడం భారంగా భావించి.. బాధ్యతలు విస్మరించిన ఆ తండ్రి చిన్నారిని నదిలోకి తోసేసి కడతేర్చిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూరారం గ్రామానికి చెందిన రావుల రాజుకు, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవల్లికి చెందిన మంజులతో వివాహమైంది.
ఇద్దరూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కూతురు పూజ షాద్‌నగర్‌లో ఏడో తరగతి, చిన్న కూతురు రూప గ్రామంలోనే నాలుగో తరగతి చదువుతుండగా రాజు మధ్యలోనే వారి చదువు మాన్పించాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవారు. చిన్నకూతురు స్నేహ పుట్టిన రెండు నెలలకే ఇంట్లో కింద పడి నడుము దెబ్బతినడంతో ఆరేళ్లు దాటినా ఇంకా నడవలేకపోతోంది.
ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నడవలేని స్థితిలో ఉన్న స్నేహ తనకు భారంగా మారుతుందని భావించి.. మంగళవారం తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని తీసుకెళ్లి గ్రామ సమీపంలో ఉన్న దుందుభినదిలో తోసి వచ్చాడు. ఇంట్లో స్నేహ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు రాజును నిలదీశారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో పాపను దుందుభినదిలో తోసి వేసినట్లు ఒప్పుకున్నాడు. జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. స్నేహ మృతదేహం తేలుతూ కనిపించింది. ఈ సంఘటనపై పాప బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment