ముంబై: ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెట్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
కంగనా, ఆమె సోదరి గత రెండు నెలలుగా ట్వీట్లు, వివాదాస్పద ప్రకటనలు, ఇంటర్వ్యూలతో సమాజంలోని వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మునావర్ అలీ సయ్యద్ బాంద్రా కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కంగనా, రంగోలిపై ఐపీసీ సెక్షన్ 153ఏ(మతం, వర్గం ఆధారంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ(మత విశ్వాసాలను గాయపర్చడం), 124ఏ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సయ్యద్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బంధుప్రీతి అంటూ బాలీవుడ్ కళాకారుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజల మత విశ్వాసాలను కించపర్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment