
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచిలో బినామీ గోల్డ్ లోన్లతో ఆ బ్యాంక్ నగదు అధికారే రూ.కోటికి టోకరా వేశాడు. బ్యాంక్‌లో మూడు వారాలుగా జరుగుతున్న ఆడిట్‌లో ఈ బినామీ గోల్డ్ లోన్ల అవినీతి వెలుగు చూసింది. బ్యాంక్‌లో దాదాపు రెండు వేల గోల్డ్ లోన్లకు సంబంధించిన నగలను భద్రపరిచిన బ్యాగ్‌లు ఉన్నాయి. అధికారులు ఆడిట్ నిర్వహించినప్పుడు గోల్డ్ లోన్లకు సంబంధించి బ్యాగ్‌ల లెక్కల ప్రకారం 25 బ్యాగులు కనిపించకపోవడంతో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి మరోసారి ఆడిట్ నిర్వహించారు.
అసలు బంగారు నగలు లేకుండానే.. బ్యాగ్‌లనేవి ఉంచకుండానే బినామీ పేర్లతో అంటే ఆ నగదు అధికారి కుటుంబీకులు, బంధువుల పేరుతో బినామీ గోల్డ్‌లోన్లు తానే తీసుకుని రూ.కోటి వరకు బ్యాంక్ సొమ్ములను రుణాల రూపంలో నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు అధికారి ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో నష్టం రావడం వల్లే వాటి భర్తీకి బ్యాంక్‌లో బినామీ గోల్డ్ లోన్ల పేరుతో పనిచేసే బ్యాంక్‌కే కన్నం వేసినట్లు తెలుస్తోంది. సోమవారం విజయవాడ నుంచి మరో ఆడిట్ అధికారుల బృందం సమనస బ్యాంక్‌కు రానుంది. అవకతకలపై ఆరోజు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment