డైల్ ఇన్‌స్టిట్యూట్ కార్యాలయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలుచేసిన వైనం బయటకొచ్చింది. 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగించిన సంస్థ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. సిద్ధార్థ్‌వర్మ విజయవాడ బందరు రోడ్డులో డైల్ ఇన్‌స్టిట్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
దేశంలోను, విదేశాల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు వల వేశారు. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, మలేషియా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్, జాతీయ రహదారులు, ఎలక్షన్ కమిషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ సంస్థల్లోను, పేరొందిన ప్రైవేటు కంపెనీల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికారు.
కార్యాలయంలో యువతులను నియమించి వారి మాటలతో బురిడీ కొట్టించి ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. రసీదులు కూడా ఇచ్చారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారికి డబ్బు వాపసు చేస్తూ చెక్కులిచ్చారు. ఆ చెక్కులు చెల్లకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మోసపోయినవారు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు.
ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, గుంటూరు, వైఎస్సార్, ప్రకాశంజిల్లాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు సిద్ధార్థ్‌వర్మను, కార్యాలయంలో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రెండేళ్లుగా దందా
కాల్ సెంటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులను నేర్పుతామని రెండేళ్ల కిందట ఈ ఇన్‌స్టిట్యూషన్‌ను సిద్ధార్థ్‌వర్మ ఏర్పాటు చేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు వైష్ణవి అనే మహిళ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు ఎక్కువగా సంస్థ కార్యాలయంలో కనిపించేవారు కాదని, అక్కడి ఉద్యోగినులే వివరాలు చెప్పి డబ్బు వసూలు చేసేవారని బాధితులు తెలిపారు.
ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు వెయ్యిమంది నిరుద్యోగులు వీరి మాటలు నమ్మి మోసపోయారని పేర్కొన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గుప్పించి తమను ఆకర్షించారని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన బాధితుడు మణికంఠ వాపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో డబ్బు చెల్లించి నెలల తరబడి ఇన్‌స్టిట్యూట్ చుట్టూ తిరిగానని చెప్పారు.
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద డబ్బు వసూలు చేశారని విజయవాడకు చెందిన ప్రవీణ్ తెలిపారు. ఉద్యోగం రాలేదని డబ్బులు అడిగితే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులచే ఎదురుదాడి చేయిస్తున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు.
బాధితులకు న్యాయం చేస్తాం..
ఉద్యోగాల పేరుతో మోసపోయామని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైల్ ఇన్‌స్టిట్యూషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంస్థ యజమానిని, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల పేరుతో మోసం చేసే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సంస్థల యజమానుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు.
– టి.కె.రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment