పోలీసుల అదుపులో దండుబోయిన సిద్ధార్థ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజమండ్రికి చెందిన ఓ యువకుడికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంది. తండ్రి రోజువారీ కూలీ. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే ఆపేశాడు. తండ్రితో పాటే కూలికి వెళ్తూ తన కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన డైల్ ఇనిస్టిట్యూషన్స్ పోస్టుకు ఆకర్షితుడయ్యాడు. వెంటనే విజయవాడ చేరుకుని ఆ సంస్థ నిర్వాహకులను సంప్రదించాడు.కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి 6 నెలల క్రితం రూ.2.39 లక్షలు వసూలు చేశారు.
ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సోమవారం విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌కు వచ్చాడు. బీఎస్‌ఎన్‌ఎల్, జాతీయ రహదారులు, ఎన్నికల కమిషన్, కార్గో తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కెనడా, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడ కేంద్రంగా నిరుద్యోగులకు వల వేసిన డయల్ ఇనిస్టిట్యూషన్స్ నిర్వాహకులు అందినకాడికి దండుకున్నారు. రెండేళ్లపాటు సాగించిన ఈ దందాకు రాష్ట్రవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగులు మోసపోయారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.12 లక్షల వరకు కాజేసినట్టు సమాచారం.
పోలీస్ కమిషనరేట్‌ను ఆశ్రయించిన బాధితులు
సూర్యారావుపేట పోలీసుల తీరుతో బాధితులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. డైల్ ఇన్‌స్టిట్యూషన్స్ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మకు పోలీసులు రాచమర్యాదలు చేస్తూ తమను దూషిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు పెడితే ఏమొస్తుంది, సెటిల్ చేసుకుని ఎంతోకొంత తీసుకెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసు దర్యాప్తు చేయకుండా పోలీసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కేసు ఎలా ముందుకు వెళ్తుందో చూస్తానంటూ ఓ పోలీసు అధికారి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన బాధితులు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌ను సోమవారం ఆశ్రయించారు. సుమారు 50 మంది బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు కమిషనరేట్‌కు వచ్చారు. డెప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీప్రశాంతికి ఫిర్యాదులు అందజేశారు.
స్టేషన్‌లోనే వంచించే యత్నం
డైల్ ఇనిస్టిట్యూషన్స్ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 18వ తేదీన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చాడు. ‘నువ్వు కంప్‌లైంట్ ఇవ్వడానికి వచ్చావా? పది రోజుల్లో మలేషియా వెళ్లాల్సిన వాడివి. కంప్‌లైంట్ ఇచ్చి ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావ్. డబ్బులు కట్టి వారం రోజుల్లో బయటకు వచ్చేస్తా.
నిన్ను మలేషియా పంపిస్తా. నా మాట విని కంప్లైంట్ ఇవ్వకు..’ అంటూ సిద్ధార్థ్‌వర్మ పోలీసుల సమక్షంలోనే మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరిని పోలీసులు ముందుగా సిద్ధార్థ్ వద్దకు తీసుకెళ్తున్నారని, ఆ తరువాతే ఫిర్యాదు తీసుకుంటున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.
‘సాక్షి’ కథనాలతో వెలుగులోకి..
డైల్ ఇనిస్టిట్యూషన్స్ సంస్థ మోసాలను ‘విజయవాడలో ఉద్యోగాల వల’ శీర్షికన ఈ నెల 15న వెలుగులోకి తెచ్చింది. దీంతో కడప, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ఏలూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. 15వ తేదీన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో 12 మంది బాధితులు ఫిర్యాదు చేయగా.. సోమవారం నాటికి ఫిర్యాదు చేసిన బాధితుల సంఖ్య 200కు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి అరెస్ట్
కాగా, కేసులో ప్రధాన నిందితుడైన దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను అరెస్ట్ చేసినట్టు సూర్యారావుపేట సీఐ జానకిరామయ్య తెలిపారు. గుంటూరుకు చెందిన నిందితుడు విజయవాడలో డైల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 200 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, నిందితుడిపై 409, 406, 420 కేసులు నమోదు చేశామన్నారు. అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన వారి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నిందితుడు గతంలోనూ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment