ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? | Husband Assassinated His Wife In NTR District | Sakshi
Sakshi News home page

ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే?

Published Fri, Jun 10 2022 11:47 AM | Last Updated on Fri, Jun 10 2022 11:47 AM

Husband Assassinated His Wife In NTR District - Sakshi

పేరం భూలక్ష్మి (ఫైల్‌)

కంచికచర్ల (నందిగామ): ఎన్టీఆర్‌ జిల్లా: తల్లి, పెద్దలు కలసి ఇష్టం లేని పెళ్లి చేశారనే నెపంతో, నిండు చూలాలైన భార్యను ఆమె భర్త హత్య చేసిన ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నందిగామ రూరల్‌ సర్కిల్‌ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్‌ కథనం మేరకు. నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన పేరం భూలక్ష్మి (22)కి అదే గ్రామంలో నివసించే పేరం గోపీతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం భూలక్ష్మి ఎనిమిది నెలల గర్భంతో ఉంది. రెండో కాన్పు కావటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిద్దామని భూలక్ష్మితో కలిసి గోపి బుధవారం ఉదయం బైక్‌ బయలుదేరాడు.
చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్‌ చేసి..

విజయవాడ వెళ్లకుండా  కంచికచర్లలోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేసి రాత్రి సమయంలో తిరిగి గోళ్లమూడి వెళ్దామని బైక్‌పై బయలుదేరారు. కీసర దగ్గరలోని నేషనల్‌ హైవేపై ఎన్‌ఎస్పీ కెనాల్‌ సమీపంలోకి రాగానే భూలక్ష్మితో గొడవ పడి చీర, తాళిబొట్టు తాడుతో ఆమె మెడకు బలంగా ఉరి బిగించాడు. భూ లక్ష్మి స్పృహ కోల్పోవడంతో, 108కు ఫోన్‌ చేసి తన భార్యకు కడుపు నొప్పి వస్తోంది, వాంతులు, విరేచనాలు అవుతున్నాయి ఆస్పత్రికి తీసుకెళ్లాలని నమ్మబలికాడు. 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే అక్కడి వైద్య సిబ్బంది విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. అదే 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసు కెళ్లగా, అప్పటికే ఆమె మృతిచెందింది. భూలక్ష్మి మృతదేహాన్ని గోళ్లమూడికి కాకుండా తన స్వగ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి గోపీ తీసుకెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహం ముఖానికి పసుపు రాసి, మెడపై తెల్లటి వస్త్రం కట్టాడు. ఆ తర్వాత భూలక్ష్మి మృతిచెందిందని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారంతా చిలుకూరు వెళ్లి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు.

ఆసమయంలో బంధువులు భూలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించగా మెడపై చీరెతో బిగించినట్లు కనిపించడంతో గోపీని నిలదీశారు. తానేమీ చేయలేదని అతడు నమ్మబలికాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసుల వద్ద భూలక్ష్మిని తానే హత్య చేశానని గోపీ అంగీకరించాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు కంచికచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపీని అదుపులోకి తీసుకుని  మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement