
సాక్షి,కోనేరుసెంటర్(క్రిష్ణా): వరకట్న వేధింపులతోపాటు ఆడపిల్ల పుట్టిందని భర్త తనను విడాకులు ఇమ్మంటున్నాడని ఓ మహిళ వాపోయింది. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి రోజు స్పందన కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అర్జీలు స్వీకరించారు. గుడివాడకు చెందిన ఓ వివాహిత తనకు ఐదేళ్ల కిందట వివాహమైందని, కొంతకాలం సజావుగా ఉన్న భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, భర్తతో పాటు అత్తమామలు హింసిస్తున్నారని వాపోయింది.
అధిక కట్నం కోసం పెట్టే వేధింపులకు తోడు ఆడపిల్ల పుట్టిందనే నెపంతో విడాకులు ఇమ్మని బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయం చేయాలని వేడుకొంది. స్పందించిన ఎస్పీ ఫిర్యాదును గుడివాడ సీఐకి సిఫార్సు చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరో ఘటనలో..
కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి తాను చేపల చెరువులు సాగు చేస్తూ జీవిస్తుంటానని, ఏడాది కిందట తెలిసిన వ్యక్తికి చెరువులను లీజుకు ఇచ్చానని, లీజు డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేయడంతో పాటు డబ్బులు అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరాడు. ఫిర్యాదును పరిశీలించి బాధితుడికి రక్షణ కల్పించాలని కైకలూరు సీఐని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పోలీసు సిబ్బంది సామరస్యంగా ఆలకించి ఫిర్యాదుల పరిష్కారంలో బాధితులకు భరోసాగా ఉండాలన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితులకు కలుగజేయాలని చెప్పారు.
చదవండి: Road Accident: పరీక్ష రాసే ముందు బాబా దర్శనం కోసం వెళుతూ.. అంతలో టైరు పేలి..
బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న
ఎస్పీ సిద్ధార్థ కౌశల్
Comments
Please login to add a commentAdd a comment