తల్లిదండ్రులు, సోదరితో మనోహర్ (పాతచిత్రం)
సాక్షి, సఖినేటిపల్లి: ఉయ్యూరువారిమెరక గ్రామానికి చెందిన చింతా మనోహర్ (23) ఆదివారం వేకువజామున హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెలవు కావడంతో స్నేహితులతో కలసి గుడికి వెళుతున్న క్రమంలో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో మృతి చెందాడు. వీరందరూ మాదాపూర్ అయప్ప సొసైటీలోని మారుతి మెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. మనోహర్‌కు వివాహమైంది. అతడి భార్య సుస్మిత, కుమార్తెతో కలిసి నర్సాపురంలో ఉంటున్నారు. ఉద్యోగ రీత్యా మనోహర్ మాదాపూర్ హాస్టల్లో ఉంటున్నాడు. మనోహర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు తాడి సహదేవ్ చెప్పే వరకూ కుటుంబ సభ్యులకు తెలియదని స్థానికులు అంటున్నారు. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై)
వీవీమెరకలో విలపిస్తున్న మనోహర్ తల్లిదండ్రులు
ప్రేమ వివాహం
వీవీ మెరకకు చెందిన సీహెచ్‌వీబీ నందం, ప్రియ దంపతులకు మనోహర్, మానస సంతానం. నందం బట్టేలంక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నర్సాపురంలో పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో మనోహర్‌కు సుస్మిత పరిచయమైంది. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. వివాహం తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ మనోహర్ ఏడాదిగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. రెండు నెలల క్రితం మాదాపూర్‌లో యానిమేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించాడు. అయితే ప్రేమ వివాహం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు.
సెటిలయ్యాక వస్తానన్నాడు
మనోహర్ మృతి చెందాడన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని నందం బోరున విలపించారు. శుక్రవారం మనోహర్‌తో మాట్లాడానని, శనివారం పాఠశాలలో కొన్ని పనులు ఉండడంతో మాట్లాడలేకపోయామన్నారు. ఆదివారం ఉదయం ప్రమాద వార్త విని తట్టుకోలేకపోయామన్నారు. జాబ్‌లో సెటిల్ అయ్యాక ఇంటికి వస్తానని మనోహర్ చెప్పేవాడని కన్నీటి పర్యతమయ్యారు. చెట్టంత కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లి ప్రియ రోదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment