పరమేష్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన పరమేశ్వర్ అనే వ్యక్తి రాజస్తాన్‌లో సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లకు చెమటలు పట్టించాడు. ఈ నెల 17న అక్కడి ఇండియా–పాకిస్తాన్ బోర్డర్‌లో హల్‌చల్ చేశాడు. ఫెన్సింగ్ దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిడానికి ప్రయత్నించాడు. పరమేశ్వర్ ఆహార్యాన్ని చూసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వివిధ విభాగాలు ఉమ్మడిగా చేసిన ఇంటరాగేషన్‌లో ఆ కోణం బయటపడకపోవడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. గురువారం అక్కడకు చేరుకున్న సోదరుడు, బావమదిరి తదితరులకు రాజస్తాన్ పోలీసులు పరమేశ్వర్‌ను అప్పగించారు. వరంగల్‌లోని ఖానాపూర్‌కు చెందిన వెంకట నర్సింహ్మ కుమారుడు ఎన్.పరమేశ్వర్ వయస్సు ప్రస్తుతం 46 ఏళ్లు. భార్యకుమారులు కలిగిన ఇతగాడు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి డైమండ్ పాయింట్ సమీపంలో నివసిస్తున్నాడు. అయితే కుటుంబ కారణాలతో పాటు ఐదేళ్ల క్రితం తన తల్లి కూడా చనిపోవడంతో పరమేశ్వర్‌కు మతిస్థిమితం తప్పింది. అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించే అతగాడు ఓ దశలో తన భార్య, పిల్లల పైనే దాడి చేయడానికి ప్రయత్నించాడు.
ఈ విషయం గమనించిన డైమండ్ పాయింట్ ప్రాంతానికి చెందిన స్థానికులు పరమేశ్వర్‌ను మందలించారు. దీంతో అప్పటి నుంచి ఇంటిని, కుటుంబాన్నీ ఇతగాడు వదిలేశాడు. కొన్నాళ్లు వేర్వేరు ప్రాంతాల్లోని తన బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి కనిపించిన రైలు ఎక్కడం, అది ఎక్కడకు వెళితే అక్కడ దిగి ఆ ప్రాంతంలో ఉన్న పరిచయస్తులు, బంధువుల ఇళ్లకు వెళ్తుండేవాడు. ఆపై ఇతడి ఆచూకీ కుటుంబీకులకు కూడా తెలియలేదు. హఠాత్తుగా గురువారం పరమేశ్వర్ రాజస్తాన్‌లో పరిచయం అయ్యాడు. అక్కడి జైసల్మీర్ ప్రాంతంలోని పోచ్ఛా ప్రాంతంలో ఉన్న ఇండో–పాక్ బోర్డర్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఫెన్సింగ్ దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఆ ఫెన్సింగ్‌కు ఉన్న ఖాళీ సీసాలు శబ్ధం చేయడంతో అక్కడి పహారా విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ 56వ బెటాలియన్ జవాన్లు గుర్తించారు. గడ్డంతో పాటు పరమేశ్వర్ ఆహార్యం చూసిన జవాన్లు ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో జిన్‌జిన్యాలీ పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో ఆ ఠాణాకు తరలించారు. పరమేశ్వర్‌ను రాజస్తాన్ పోలీసులు, బీఎస్‌ఎఫ్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు.
తాను హైదరాబాద్ నుంచి వచ్చానని, తన స్వస్థలం ఖానాపూర్ అని వారితో చెప్పిన పరమేశ్వర్ తన తండ్రి, సోదరుల వివరాలు వెల్లడించాడు. దీంతో జిన్‌జిన్యాలీ అధికారులు ఖానాపూర్ పోలీసుల ద్వారా పరమేశ్వర్ సోదరుడు పుల్లయ్యకు సమాచారం ఇచ్చారు. ఇతడితో పాటు పరమేశ్వర్ బావ అనిల్ తదితరులు గురువారం జిన్‌జిన్యాలీ ప్రాంతానికి చేరుకున్నారు. పరమేశ్వర్ తమ సంబంధీకుడే అని నిరూపించడానికి అవసరమైన పత్రాలు సమర్పించాడు. అప్పటికే ఐబీ, రా సహా వివిధ ఏజెన్సీలో కూడిన బృందాల ఉమ్మడి ఇంటరాగేషన్‌లోనూ పరమేశ్వర్‌కు సంబంధించి ఎలాంటి అనుమానిత అంశాలు వెలుగులోకి రాలేదు. దీంతో అతడిని రాజస్తాన్ పోలీసు లు కుటుంబీకులకు అప్పగించారు. పరమేశ్వర్ సోదరు డు పుల్లయ్య శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘దాదాపు ఐదేళ్ల తర్వాత మా సోదరుడిని తొలిసారి చూస్తున్నా. మతిస్థిమితం లేని ఇతడు మా చిరునామా, ఇతర వివరాలు రాజస్తాన్ పోలీసులకు ఎలా చెప్పాడో అర్థం కావట్లేదు. గురువారం మమ్మల్ని చూసిన వెంటనే గుర్తుపట్టాడు. అయితే ఆ తర్వాత మా త్రం సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నాడు. గురువారం రాజస్థాన్ నుంచి పరమేశ్వర్‌తో కలిసి కారు లో బయలుదేరి గుజరాత్ వరకు చేరుకున్నాం. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అతడి భార్యకు అప్పగించడంతో పాటు వైద్యం చేయిస్తాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment