
సాక్షి,హైదరాబాద్: రియల్‌ఎస్టేట్ మోసాలతోపాటు భూ కబ్జాలకు పాల్పడిన సంధ్య హోటల్స్, కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుకు నార్సింగి పోలీసులు 41 సీఆర్‌పీ నోటీసు జారీ చేశారు. గతంలో రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్లలో అతనిపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఓ భూకబ్జా వ్యవహారంపై కేసు నమోదు అయ్యింది.
సదరు కేసులో నార్సింగి పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఈనెల 22 వరకు అతడిని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు వేచి చూసిన నార్సింగి పోలీసులు శుక్రవారం జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌లోని అతని నివాసానికి వెళ్లారు. అతను ఇంట్లో లేకపోవటంతో 41సీఆర్‌పీ నోటీసును ఇంటికి అతికించి వచ్చినట్లు నార్సింగి సీఐ శివకుమార్ పేర్కొన్నారు. అతనిపై కేసులు నమోదైన నేపథ్యంలో విచారణకు సహకరించకుండా బెంగుళూరులో తలదాచుకున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. దీంతో శ్రీధరరావు కోసం బెంగళూరుకు సైబరాబాద్ పోలీసులు స్పెషల్ టీం ని పంపించారు.
చదవండి: రాత్రి భోజనం చేసి పడుకున్నాడు.. ఉదయం లేచి చూసేసరికి..