సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని కుదూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెట్టహళ్లి గ్రామం వద్ద ఒక తోటలో 18 సంవత్సరాల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన సదరు యువతి అప్పటి నుంచి కనిపించలేదు. తోటలో విగతజీవిగా కనిపించింది. శవాన్ని పూడ్చినప్పటికీ ఘటనాస్థలంలో రక్తపు మరకలు, గుంత తవ్విన గుర్తుల ఆధారంగా అనుమానంతో తవ్వి చూడగా మృతదేహం బయటపడింది. తలపై బలమైన గాయం, శరీరంపై రక్త గాయాలు ఉన్నాయి. అసిస్టెంట్ కలెక్టర్ దాక్షాయిణి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు మూడు సంవత్సరాలుగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది. ఇందుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఇరువైపుల పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయితే హత్యకు దారితీసిన కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (వారి నిర్లక్ష్యం.. చిన్నారులకు మరణ శాసనం)
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం
హోసూరు: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై మృత్యువు పంజా విసిరి బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హోసూరు హడ్కో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. తిరుపత్తూరు జిల్లా పల్లిపట్టు ప్రాంతానికి చెందిన కణ్ణయ్య కుమార్తె జమున(24) తన తల్లి వనితతో కలిసి బెంగళూరులోని మాదేవపురం ప్రాంతంలో అద్దెగదిలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. జమునకు పల్లిపట్టు ప్రాంతానికి చెందిన ఓ యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. దీంతో శనివారం సాయంత్రం జమున తన తల్లితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తూ కుముదేపల్లి వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. జమున ఘటనా స్థలంలోనే మృతి చెందగా వనిత గాయపడింది. స్థానికులు ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హడ్కో పోలీసులు జమున మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment