
రాజేంద్రనగర్: పశువుల దాణా లోడ్‌తో వస్తున్న ఓ లారీ డ్రైవర్ గుండెపోటుకి గురై స్టీరింగ్‌పైనే మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్నాడు.
ఆ సమయంలో తన భార్య నాగలక్ష్మికి ఫోన్ చేసి ఛాతీలో నొప్పిగా ఉందని, వాహనాన్ని నడపలేకపోతున్నానని చెప్పాడు. దీంతో భార్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. అలాగేనంటూ వాహనంతో ముందుకు కదిలాడు. గగన్‌పహాడ్ ఓవర్ బ్రిడ్జి దాటిన అనంతరం ఏజీ వర్సిటీ సబ్ రోడ్డు వద్దకు రాగానే గుండెనొప్పి తీవ్రం కావడంతో స్టీరింగ్‌పైనే పడి మృతి చెందాడు.
లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టి పుట్‌పాత్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కారు ఎయిర్‌బెలూన్‌లు తెరుచుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment