అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై | Madhya Pradesh Robbery Gang Arrested In Nizamabad District | Sakshi
Sakshi News home page

అతిథుల్లా వచ్చి.. అద్దె పిల్లలతో చోరీలు

Jan 18 2021 8:17 AM | Updated on Jan 18 2021 1:27 PM

Madhya Pradesh Robbery Gang  Arrested In Nizamabad District - Sakshi

ప్రధానంగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన పిల్లలను ఎక్కువగా అద్దెకు తీసుకుంటారు. పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది.

నిజామాబాద్ ‌అర్బన్‌: దొంగతనాల్లో వీరి స్టైలే వేరు. అతిథుల్లా వచ్చి అద్దె పిల్లలతో భారీ చోరీ చేస్తుంటారు. ఇదే తరహాలో ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో 35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని మూడు గ్రామాలు ఈ తరహా దొంగలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీసొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేసు వివరాలను నేడో, రేపో పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాజ్‌ఘడ్‌ జిల్లాలోని మూడు గ్రామాలు గులాఖేరి, కడియ, సుల్‌ఖేరి.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉంటాయి. 

ఈ గ్రామాలకు చెందిన కొంతమంది దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇందుకోసం 12 ఏళ్లలోపు పిల్లల్ని అద్దెకు తీసుకుంటారు. ఫంక్షన్‌కు వచ్చేవారిలో కలసి పోవడం, బంగారం ఎక్కువగా ధరించినవారితో మాటలు కలపడం, చాకచక్యంగా సొత్తు తస్కరించడం వంటివి వారికి నేర్పిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన పిల్లలను ఎక్కువగా అద్దెకు తీసుకుంటారు. పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఫంక్షన్‌హాల్‌కు ఖరీదైన వాహనంలో వస్తారు. ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లలో మత్తు మందు కలిపి ‘టార్గెట్‌’చేసిన వారికి ఇస్తారు. వారు మత్తులోకి జారగానే బంగారం తీసుకుని పరారవుతారు.

నిజామాబాద్‌లో భారీ చోరీ..
గత డిసెంబర్‌లో నిజామాబాద్‌ జిల్లాలో ఈ తరహాలోనే నిందితులు భారీ చోరీ చేశారు. డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలోకి ప్రవేశించారు. ముగ్గురు బయట కారులో వేచి చూడగా.. బాలుడు, మరో ఇద్దరు లోనికి వెళ్లారు. పెళ్లి కుమార్తె మెడలో డైమండ్‌ హారంతోపాటు భారీగా బంగారం ఉండటంతో తస్కరించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూతురి గదిలోకి వెళ్లిన బాలుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి, డైమండ్‌ నెక్లెస్‌, 35 తులాల బంగారం తస్కరించారు. అనంతరం ఆరుగురు కారులో పరారయ్యారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్‌లో బాలుడుసహా నిందితులు పారిపోతున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement