
నెల్లికుదురు/కురవి/మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన సుప్రియ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుప్రియపై నిందితులు రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఆలేరు గ్రామానికి చెందిన సుప్రియ లైంగిక దాడి గురించి ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ నెల 18న ఆమె పురుగు మందు తాగడంతో చికిత్స పొందుతూ 22వ తేదీన మృతిచెందింది. నిందితులను విచారించి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు కోర్టులో కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, సుప్రియ ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుప్రియ కుటుంబానికి న్యాయం చేసి, దోషులను కఠినంగా శిక్షించాలంటూ మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద బీజేపీ, ప్రగతిశీల మహిళా సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీస్ పహారాలో సుప్రియ మృతదేహాన్ని ఆలేరుకు తరలించారు.