హొళగుంద: రెండు మృతదేహాలు.. యువతి, యువకుడు. ఇద్దరి నడుముకు చున్నీతో కట్టేసి ఉంది. 30 ఏళ్ల వయస్సులోపు వారు. ప్రేమికులా.. దంపతులా.. వివాహేతర సంబంధమా.. ఇలా ఎన్నో అనుమానాలు ఆ మృతదేహాల చుట్టూ తిరుగుతున్నాయి. శనివారం బాపురం సమీపంలో ఎల్లెల్సీలో తేలియాడిన మృతదేహాలను అక్కడ దుస్తులు ఉతుకుతున్న స్థానికులు గుర్తించి హాలహర్వి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపు ముందుకు కొట్టుకుపోయి కనిపించలేదు.
అప్పటికే చీకటి పడటంతో గాలింపు నిలిపేశారు. ఆదివారం హొళగుంద పోలీసులు స్థానిక సమ్మతగేరి క్యాంపు వద్ద కొట్టుకొస్తున్న మృతదేహాలను గుర్తించి పంచాయతీ సిబ్బందితో వెలికి తీయించి అక్కడే పంచనామా నిర్వహించారు. కాలువలో పడి దాదాపు నాలుగైదు రోజులు కావడంతో మృతదేహాలు ఉబ్బి దుర్వాసన వస్తున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ భాస్కర్, ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
ఎన్నో అనుమానాలు..
► మృతదేహాలపై ఉన్న వస్త్రాల ఆధారంగా మృతులది పట్టణ ప్రాంతంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
► జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, చుడిదార్ ఉండటంతో కాల్వకు చుట్టు పక్కల పట్టణ ప్రాంతానికి (ఆలూరు, ఆదోని, బళ్లారి, మోకా) చెందిన వారై ఉంటారని తెలుస్తోంది.
► మృతదేహాలకు చున్నీ కట్టి ఉండటంతో కులాంతర వివాహం, లేదా వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరిని హత్య చేసిన తర్వాత మృతదేహాలను కట్టేసి కాల్వలో పడేశారా అని చర్చించుకుంటున్నారు.
► శవాలు రెండూ నీటిలో తేలియాడిన ప్రాంతానికి గూళ్యం దగ్గరలో ఉంది. ఈనెల 18న గూళ్యం జాతర జరిగింది. జాతరకు వేల మంది హాజరయ్యారు. ఆ నేపథ్యంలో వారిద్దరు ఇక్కడ కలుసుకుని, ఏదైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా? లేక వీరిని వెంబడించి చంపేశారా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment