పోకిరి రాంబాబు పాడుబుద్ధి | Man Arrested For Behaving Indecently In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళలే అతని టార్గెట్

Published Mon, Aug 3 2020 8:49 PM | Last Updated on Tue, Aug 4 2020 1:38 PM

Man Arrested For Behaving Indecently In Visakhapatnam - Sakshi

రాంబాబుకు దేహశుద్ధి చేస్తున్న మహిళలు, స్థానికులు

సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిని దిశ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, మహారాణిపేట పోలీసులు సంయుక్తంగా సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ డాక్టర్‌ జి.ప్రేమ్‌కాజల్‌ వివరాలు వెల్లడించారు. జూన్‌ 24న, అదే నెల 30న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నోవాటల్‌లో పనిచేస్తున్న అమ్మాయిని ఒక ఆకతాయి పందిమెట్ట ప్రాంతంలో బైక్‌పై వచ్చి హెల్మెట్‌ పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించి పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత మరో మహిళను కూడా అదేమాదిరిగా వేధించాడు. బాధితులు నగర పోలీస్‌ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ డాక్టర్‌ జి.ప్రేమ్‌కాజల్‌ సహకారంతో మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమారా ఫుటేజీ సాయంతో నిందితుడి బైక్‌ నంబర్‌ గుర్తించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నోవాటల్‌ జంక్షన్, బీచ్‌రోడ్డులో మఫ్టీలో మహిళా పోలీసులు, బాధితులు, మహారాణిపేట పోలీసులు విడివిడిగా నిఘా పెట్టారు. నోవాటల్‌ వద్దకు నిందితుడు వచ్చేసరికి మఫ్టీలో గల పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇంతలో బాధిత మహిళలు కూడా అక్కడకు చేరుకుని నిందితుడిని గుర్తుపట్టి దేహశుద్ధి చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై దిశ చట్టం ప్రకారం ఐపీసీ 354, 354–ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ప్రేమ్‌కాజల్‌. పక్కన నిందితుడు దుప్పాడ రాంబాబు (నిల్చున్న వ్యక్తి)  

నిందితుడి దినచర్య అదే.. 
నిందితుడు అఫీసియల్‌ కాలనీకి చెందిన దుప్పాడ రాంబాబు(30)గా పోలీసులు గుర్తించారు. పందిమెట్ట ప్రాంతంలో గల ఓ షిప్పింగ్‌ కంపెనీలో అకౌంటెంట్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని, పెళ్లై భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ తెలిపారు. ఇంటి నుంచి కంపెనీకి వెళ్లే మార్గంలో ఒంటరిగా కనిపించే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే దినచర్యగా పెట్టుకున్నా డు. రాంబాబును విచారించగా గతంలో ఆర్టీసీ కాంప్లక్స్, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో ఒంటరి మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు.  

ధైర్యంగా ఫిర్యాదు చేయండి  
మహిళల పట్ల ఆకతాయిలు దాడులకు పాల్పడినా, లైంగికంగా వేధించినా బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయా లని ఏసీపీ డాక్టర్‌ జి.ప్రేమ్‌కాజల్‌ కోరారు. ఆకతాయి వేధింపుల విషయంలో బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయడంతో వారిని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా అభినందించారన్నారు. మహిళలకు జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని రూపొందించారన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆపద సమయంలో యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.

అత్యవసర సహాయం కోసం డయల్‌ 100, 112, మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర (9121211100, 9493336633) ద్వారా పోలీస్‌లకు సమాచారమిస్తే అండగా ఉంటామని స్పష్టం చేశారు. తాజాగా సోమవారం నుంచి ఈ రక్షాబంధన్‌ యాప్‌ కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారన్నారు. దీనిపై మహిళలకు పూర్తి అవగాహన కలి్పస్తామని పేర్కొన్నారు. సమావేశంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ సీఐ జి.నిర్మల, టూ టౌన్‌ సీఐ వెంకటరావు, మహారాణిపేట ఎస్‌ఐ ఆర్‌.హెచ్‌.ఎన్‌.వి.కుమార్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement