యర్రగొండపాలెం: ఓ బాలుడిని రెండు కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టి ఆపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డీఎస్పీ డాక్టర్ ఎం.కిషోర్‌కుమార్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ స్థానిక మార్కాపురం రోడ్డులోని అనకుంట వద్ద తుపాకుల సాయికల్యాణ్ (8) అనే బాలుడిని హత్య చేశారు. ముందుగా, ఈ కేసులో నిందితుడు ఒకడేనని భావించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఇద్దరుగా గుర్తించారు.
డీఎస్పీ తెలిపిన సమాచారం ప్రకారం... గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని మాదినపాడుకు చెందిన లక్ష్మి (బాలుడి తల్లి)కి పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో వివాహం జరిగింది. సాయికల్యాణ్ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అనంతరం లక్ష్మి తన తల్లి కృష్ణవేణి, కుమారుడితో కలిసి వేరే ఇంట్లో అద్దెకు ఉంటూ దాచేపల్లి మండలంలోని కేసనపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయశాఖలో ఐసీఆర్పీగా పనిచేసింది. ఆ సమయంలో.. అంటే దాదాపు నాలుగేళ్ల క్రితం బుర్రి జానారెడ్డితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. వారిద్దరూ కలిసి మిర్యాలగూడలోని శాంతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. బాలుడు మాత్రం తన అమ్మమ్మ కృష్ణవేణి వద్దే ఉంటున్నాడు. తల్లి వద్ద ఉంటున్న కుమారుడిని చూడటానికి తరుచూ లక్ష్మి వెళ్లివస్తుండేది. జానారెడ్డి మాత్రం కుమారుడిని వదిలి తనవద్దే ఉండాలని, లేకుంటే కుమారుడిని చంపుతానని బెదిరించేవాడు.
దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక తన తల్లి, కుమారుడితో కలిసి యర్రగొండపాలెంలోని తన అక్క వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని లక్ష్మి ఉంటోంది. ఐసీఆర్పీ విధులను కూడా వై.పాలేనికి మార్పించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ విధుల నుంచి కూడా తప్పుకుని హైదరాబాద్, సూర్యాపేటలో చీరలు కొనుగోలు చేసి ఎంబ్రాయిడింగ్ చేయించి మిర్యాలగూడలో అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ, యర్రగొండపాలెం ప్రాంతాలకు లక్ష్మి రాకపోకలు సాగిస్తోంది. జానారెడ్డి మాత్రం లక్ష్మిని బెదిరిస్తూనే ఉన్నాడు. అతని వద్దకు వెళ్లకుండా వదిలించుకుంటూ వస్తున్న లక్ష్మి.. చివరికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుమారుడి అడ్డు తొలగిస్తేగానీ, తన వద్దకు రాదని జానారెడ్డి భావించాడు. అతని బంధువైన బ్రహ్మారెడ్డితో కలిసి మోటారు సైకిల్‌పై యర్రగొండపాలెం చేరుకుని 23వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో అమ్మమ్మతో కలిసి నిద్రిస్తున్న సాయికల్యాణ్‌ను ఎత్తుకెళ్లారు.
తల్లి వివరాలు అడగ్గా, బాలుడు సమాధానం చెప్పాడు. అయినప్పటికీ లక్ష్మిపై ఉన్న కోపంతో సాయికల్యాణ్ రెండు కాళ్లు పట్టుకుని గాలిలోకి లేపి నేలకేసి కొట్టారు. అనంతరం బండరాయితో కొట్టి ఘోరంగా హత్యచేశారు. ఈ కేసును సీఐ పి.దేవప్రభాకర్, త్రిపురాంతకం, యర్రగొండపాలెం ఎస్సైలు యు.వెంకటక్రిష్ణయ్య, పి.ముక్కంటి, హెడ్ కానిస్టేబుల్ డి.శ్రీను, కానిస్టేబుళ్లు ఆర్.అంజి, డి.హుస్సేన్, ఆర్.వి.బ్రహ్మం, డి.రాజావెంకటేశ్వర్లు ఛేదించారు. సకాలంలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన వీరిని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభినందించారని డీఎస్పీ తెలిపారు.
చదవండి: బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment