శారీరక కొలతలు సరిపోకపోవడంతో... | Man Self Elimination Depression Over Not Getting Army Job In Adilabad | Sakshi
Sakshi News home page

శారీరక కొలతలు సరిపోకపోవడంతో...

Published Mon, Jan 18 2021 9:03 AM | Last Updated on Mon, Jan 18 2021 2:44 PM

Man Self Elimination Depression Over Not Getting Army Job In Adilabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కుభీర్‌(ముథోల్‌): మండల కేంద్రమైన కుభీర్‌కు చెందిన జిట్ట ప్రవీణ్‌ (24) ఆర్మీ ఉద్యోగం రాదనే బెంగతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కుభీర్‌కు చెందిన జిట్ట శంకర్‌–అనిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్‌ డిగ్రీ మధ్యలో చదువు ఆపేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆర్మీ ఉద్యోగం కోసం అతని స్నేహితులు దరఖాస్తు చేసుకోగా.. అందుక్కావాల్సిన అర్హతల కోసం కరీంనగర్‌లో ఆర్మీ ఎంపికకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌కు ప్రవీణ్‌ ఫోన్‌ చేశాడు. వారు చెప్పిన శారీరక కొలతలు తనకు సరిపోకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తమ వ్యవసాయ చేన్లోని చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తిరిగి రాకపోవడంతో తమ్ముడు ప్రశాంత్‌ తొమ్మిది గంటలకు చేన్లోకి వెళ్లగా చెట్టుకు వేలాడుతూ కన్పించాడు. ప్రవీణ్‌ మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
(చదవండి: అతిథుల్లా వచ్చి.. అద్దె పిల్లలతో చోరీలు)

ఆర్మీ ఉచిత శిక్షణకు స్పందన
బెల్లంపల్లి: బెల్లంపల్లి రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో పట్ట ణంలోని ఏఎంసీ మైదానంలో ఆదివారం నిర్వహించిన ఆర్మీ ఉచిత శిక్షణకు స్పందన లభించింది. ఏసీపీ ఎం.ఏ రహెమాన్‌తో కలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు అభ్యర్థుల రిజిస్ట్రేషన్, విద్యార్హత ధృవపత్రాలను పరిశీలించారు.

215 మంది హాజరు..
మార్చి 5 నుంచి 24 వరకు సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో పాల్గొనే యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏసీపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ పోలీసులు ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా యువకులకు ముందస్తుగా ఆదివారం శారీరక పరీక్షలు నిర్వహించారు. 215 మంది ర్యాలీలో పాల్గొనగా రాత పరీక్షకు 83 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు. ఎంపికైన యువకులకు ఈనెల 24న బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్‌ హైస్కూల్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబర్చిన మొదటి 50 మందికి క్యాంపులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఏసీపీ రహేమాన్‌ తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్‌ సీఐ కె.జగదీష్, ఎస్సైలు సమ్మయ్య, భాస్కర్‌రావు, రమాకాంత్, బెల్లంపల్లి పీఈటీ అసోసియేషన్‌ నాయకులు, పీఈటీలు ఇమ్మానియెల్, బండి రవి, మిట్టపల్లి రమేశ్, ఎస్‌కే రాజ్‌మహ్మద్, అమర్, సత్యనారాయణ, చక్రపాణి, చాంద్‌పాష, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే,ఏసీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement