
సాక్షి, సత్తుపల్లి (ఖమ్మం): ఈ కరోనా కాలంలో అందరూ మాస్క్‌లు ధరించడం సహజమవడంతో.. ఓ మోసగాడు దొంగ తెలివి ప్రదర్శించాడు. సిద్ధారం గ్రామానికి చెందిన గుళ్లపల్లి లక్ష్మీనారాయణకు చెందిన చికెన్ సెంటర్ వద్దకు మాస్క్ ధరించిన గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తనకు రూ.7వేలకు రూ.100, రూ.50 నోట్ల చిల్లర కావాలని అడిగాడు. దీంతో లక్ష్మీనారాయణ వెనుకనే ఆయన ఇంటి గుమ్మం వద్దకు వెళ్లాడు. తెలిసిన వ్యక్తిలా మాటలు కలిపి అనుమానం రాకుండా చేశాడు. చిల్లర తీసుకున్నాక.. తాగేందుకు మంచినీళ్లు కావాలని అడగటంతో ఆయన తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా ఈ మోసగాడు తీసుకున్న చిల్లరకు డబ్బులు ఇవ్వకుండానే పరారయ్యాడు.
కాసేపటికే నీళ్ల గ్లాసుతో బయటికొచ్చిన లక్ష్మీనారాయణ మోసపోయినట్లు గ్రహించి స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాడు. అతను ద్విచక్రవాహనంపై వచ్చినట్లు పుటేజీ లభ్యమైంది. అయితే.. వేసుకొచ్చిన ఫ్యాషన్‌ప్రో బండికి ముందు, వెనుక నంబర్ ప్లేట్లు లేవు. దీంతో తనలా మరొకరు మోసపోకూడదని ఆ దృశ్యాలను, మోసపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బాధితుడు గుళ్లపల్లి లక్ష్మీనారాయణ కుమారుడు వెంకట్రామయ్య మాస్క్ మాటున జరిగిన మోసాన్ని పోస్టు చేసిన వెంటనే మరి కొందరు బయట పడ్డారు.
తమకు కూడా ఇదే తరహాలో మోసం చేశాడని బాధితులు వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని.. నిందితుడు సత్తుపల్లి, కాకర్లపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. మాస్క్ పెట్టుకున్న అపరిచిత వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment