పట్టుబడ్డ నగదుతో సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: లంచం తీసుకున్న కేసులో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరాచారి, జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది. గిడ్డంగుల సంస్థలో గ్రేడ్–1 మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బానోత్ సుందర్‌లాల్‌కు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే రూ.75 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కరాచారి, సుధాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం సుందర్‌లాల్ రూ.75 వేల నగదును సుధాకర్‌రెడ్డికి ఇచ్చాడు. అక్కడే మాటేసిన అధికారులు తొలుత సుధాకర్‌రెడ్డి.. ఆ తర్వాత భాస్కరాచారిని అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఏసీబీ జడ్జి ముందు నిందితులను ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు ఏసీబీ అధికారులు ఇద్దరు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఘటనపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘బాధితుడు సుందర్‌లాల్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 6 నెలలుగా తిప్పించుకుంటున్నారు. రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సుందర్‌లాల్ గతంలో కరీంనగర్‌లో ఏసీబీ కేసులో ఉండటంతో దానిని కారణంగా చూపి, అతని ఫైల్ ముందుకు సాగనివ్వలేదు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి..’అని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment